‘నవరత్నాల’తో విప్లవాత్మక మార్పు

Buggana Rajendranath Says Revolutionary change with Navaratnalu Schemes - Sakshi

‘మండలి’లో బడ్జెట్‌పై చర్చలో ఆర్థిక మంత్రి బుగ్గన  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మేలుచేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోందని, కరోనా కష్టకాలంలోను ఆ బాట వీడలేదని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టంచేశారు. బడ్జెట్‌పై శాసనమండలిలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నవరత్నాలతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని, వీటి అమలుతో ఏపీలో పేదరికం తగ్గుతోందన్నారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

తాజాగా చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియ కూడా పూర్తవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బులు పంచేందుకు, అనేక పథకాలకు చేసిన అప్పులను, చెల్లించని బిల్లులను తమ ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తోందని గుర్తుచేశారు. వాస్తవాలను మభ్యపెట్టే విషయంలో చంద్రబాబుకున్న తెలివితేటలు తమకు లేవన్నారు. ఉక్రెయిన్‌లో బాంబులు ఎక్కడెక్కడ పడ్డాయో గూగుల్‌ మ్యాప్‌లో కమాండర్‌ పట్టాభితో కనిపెట్టగలిగే తెలివితేటలు చంద్రబాబు సొంతమని బుగ్గన ఎద్దేవా చేశారు. 

ఉద్యోగులకు మరింత మేలు
ఇక మండలిలో వైఎస్సార్‌సీపీ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగ వయో పరిమితి పెంపు, పెండింగ్‌ కరువు భత్యాలు ఒకేసారి చెల్లింపు వంటి అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుందని, రానున్న కాలంలో వారికి మరింత మేలు చేయనుందన్నారు. ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రనాథ్‌బాబు,  సి.రామచంద్రయ్య, మెట్టు గోవిందరరెడ్డి, రమేష్, రవిరాజు, కత్తి నరసింహారెడ్డి, షేక్‌ షాబ్జీలు కూడా బడ్జెట్‌పై మాట్లాడారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top