ఆ వంద లేఖలు బయటపెట్టాలి  | BJP state president Kishan Reddy challenges KCR | Sakshi
Sakshi News home page

ఆ వంద లేఖలు బయటపెట్టాలి 

Nov 23 2023 3:54 AM | Updated on Nov 23 2023 3:54 AM

BJP state president Kishan Reddy challenges KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రానందునే వివిధ పథకాలు ఆలస్యం అయ్యాయని సీఎం కేసీఆర్‌ చెబుతున్న మాటలు అర్థరహితమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మెడికల్‌ కాలేజీల కోసం వంద లేఖలు రాశానంటున్న కేసీఆర్‌ దమ్ముంటే వాటిని బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. ‘మేమే మెడికల్‌ కాలేజీ ఇస్తామని లేఖ రాస్తే కేసీఆర్‌ స్పందించలేదు... అన్ని రాష్ట్రాలకు రాసినట్లే.. తెలంగాణకు కూడా లేఖ రాశాం. ఫార్మాట్‌లో దరఖాస్తు పెట్టుకోండి వెంటనే మంజూరు చేస్తామంటే.. స్పందనేది?’అని ప్రశ్నించారు.

అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్వయంగా లేఖ రాసినా దానికి సీఎం నుంచి సమాధానం రాలేదన్నారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రం దరఖాస్తు చేసుకోకపోగా సీఎం కేసీఆర్‌ సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఫ్యామిలీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు.. అవినీతి , బంధుప్రీతి ఆ పార్టీల విధానం.. అని మండిపడ్డారు. 2014లో ఇచ్చిన దళిత సీఎం హామీని కేసీఆర్‌ ఇప్పుడైనా అమలుచేస్తారా ? దళిత సీఎంని ప్రకటిస్తారా ? బీసీ సీఎంను చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? అని ప్రశ్నించారు.  

కాంగ్రెస్‌ వస్తే మరింత విధ్వంసం... 
రాష్ట్రంలో అధికారంలో ఉంటూ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే...కాంగ్రెస్‌ అధికారానికి వస్తే మరింత విధ్వంసం చేస్తుందని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని దోచుకుంది. 50 ఏళ్లపాటు పాలించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కాంగ్రెస్‌ పార్టీకి అవినీతి ఒక వృత్తి, ఒక కళ.. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన పార్టీ అది. అవినీతికి పర్యాయపదం ఆ పార్టీ’’అని ధ్వజమెత్తారు. ’’యూపీఏ హయాంలో రూ.10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుంభకోణాల పేరుతో దోపిడీ చేసింది.. కర్ణాటకలో ఇటీవలే అధికారంలోకి వచ్చి.. వందల రూ.కోట్లు తెలంగాణలో ఎన్నికల కోసం ఖర్చుచేస్తోంది.’’అని విమర్శించారు. బీసీలను అవమానించే విధంగా రాహుల్‌ గాందీ, కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.  

నిజం మాట్లాడిన నిర్మలా సీతారామన్‌ను విమర్శిస్తారా? 
‘వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమన్నాం తప్ప.. రైతులనుంచి ఒక్క రూపాయి కూడా వసూలుచేయమని చెప్పలేదు. డిస్కంల ద్వారా ఎంత ఉత్పత్తి అవుతోంది. ఎంత పంపిణీ అవుతోంది. కంపెనీలు దొంగతనంగా వాడే కరెంటు ఎక్కడకు పోయిందో చెప్పాలి. రైతుల పేరు చెప్పి.. ఇతరులకు ఇస్తున్న కరెంటు లెక్కలు తెలవాలన్నదే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్దేశం కాగా...ఒక మహిళా మంత్రిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడడం పద్ధతేనా..అసలు కేసీఆర్‌కు సిగ్గుందా ?’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. నిర్మల సీతారామన్‌ వాస్తవాలే మాట్లాడారని అన్నారు. 

3న బీజేపీ అధికారంలోకి వస్తుంది...రైతులు వడ్లు అమ్ముకోవద్దు... 
బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారు.. డిసెంబర్‌ 3న అధికారంలోకి వస్తుంది.. అప్పటి వరకు రైతులు వడ్లను అమ్ముకోకండి. వరి క్వింటాల్‌ కనీస ధర రూ.3,100కు కొంటుంది. బీజేపీ అధికారానికి రాగానే రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తుంది’అని కిషన్‌రెడ్డి హామీనిచ్చారు. డిసెంబర్‌ 3 తర్వాత బీసీ నేత పేరును సీఎంగా తాము ప్రతిపాదిస్తామన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement