కార్పొరేషన్లు గెలవాలి.. కాంగ్రెస్‌ను దించాలి | BJP National President Nitin Nabin gives direction to party leaders | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్లు గెలవాలి.. కాంగ్రెస్‌ను దించాలి

Jun 29 2026 2:41 AM | Updated on Jun 29 2026 2:41 AM

BJP National President Nitin Nabin gives direction to party leaders

పార్టీ శ్రేణులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్‌ దిశానిర్దేశం

యువతకు ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ప్రజల ఆకాంక్షలను చిదిమేశాయని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ను గద్దె దించడమే ధ్యేయంగా వచ్చే రెండున్నరేళ్లపాటు యావత్‌పార్టీ ముందుకు సాగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్‌ పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్‌ అవినీతికి వ్యతిరేకంగా ఎంపీలు మొదలు అన్ని స్థాయిల వారు తమ పరిధులు, క్షేత్రాల్లో పోరాడి, ఎక్కడికక్కడ ప్రజల మద్దతును కూడగట్టాలన్నారు. ఆదివారం రాత్రి బీజేపీ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో జరగబోయే ప్రతీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్‌  కార్పొరేషన్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. 

మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, ప్రజల పురోగతి కోసం అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై వెంటనే యువమోర్చా ఆధ్వర్యంలో రోడ్డెక్కి విద్యార్థి, యువత మద్దతును కూడగట్టే దిశలో కార్యాచరణను ప్రారంభిస్తుందని ప్రకటించారు.రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తిస్థాయిలో సహకరిస్తే..తెలంగాణ ఏర్పడ్డాక  గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా చిదిమేశాయని మండిపడ్డారు. ప్రధానంగా నీటిపారుదల రంగంలో భారీ అవినీతికి తెరతీసి తెలంగాణలోని బీడుబారిన పొలాలకు సాగునీరు చేరకుండా అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు.  

నెల రోజుల్లో వాతావరణం మారాలి: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం. నెల రోజుల్లో ఆ వాతావరణం క్రియేట్‌ చేయాలి. ఎవరో వస్తారు కాదు. మీరు ఒక నేరేటివ్‌ క్రియేటివ్‌ చేయాలి. మీరు అది క్రియేట్‌ చేశాక అప్పుడు హైకమాండ్‌ నుంచి ఏం చేయాలో అది చేస్తాం. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్కోప్‌ ఉంది. కులపిచ్చి బంద్‌ చేయండి..మీరు ఇలాగే ఉంటే పార్టీ ముందుకు పోదు. ఇకనైనా మారండి. పార్టీ ఫస్ట్‌..లీడర్‌ నెక్టŠస్‌. ఎవరు ఏం చేస్తున్నారో నాకు ఐడియా ఉంది. కష్టపడి పని చేయండి. ఐక్యంగా ముందుకు సాగాలి. నేను గతంలో తెలంగాణలో పర్యటించాను. నాకు కొంత ఐడియా ఉంది. ఇవాళ తేదీ గుర్తు పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇది గుర్తు చేసుకోవాలి’ అని నితిన్‌నబిన్‌ చెప్పారు. ఆదివారం ఆయన పాల్గొన్న మూడు సమావేశాల్లోనూ దశాబ్దాలుగా తెలంగాణతో బీజేపీకున్న అనుబంధం, కార్యకర్తల త్యాగం, బలమైన కేడర్‌ తదితరాలను ప్రస్తావించారు. 

మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని, అక్కడి నుంచి ఊట్‌పల్లిలో రంగారెడ్డి రూరల్‌ జిల్లా కార్యాలయం, మరో 8 జిల్లాల ఆఫీస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల పరిధిలోని పోలింగ్‌ బూత్‌ల అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగించారు.  సోమవారం ఉదయం 10 గంటలకు  ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ క్యాంపస్‌లో ‘స్టూడెంట్స్‌ అండ్‌ యూత్‌ కాన్‌క్లేవ్‌’లో యువత, విద్యార్థులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి భువనగిరి మీదుగా వరంగల్‌కు చేరుఒని, మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండలోని అశోక కన్వెన్షన్‌లో గిరిజన, ఆదివాసీ నాయకులతో, సాయంత్రం 4 గంటలకు వరంగల్‌లోని ఆర్ట్స్‌కాలేజీ గ్రౌండ్స్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో భేటీ జరగనుంది. రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement