
సాక్షి, ఢిల్లీ: బీసీల విషయంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ ద్వంద్వవైఖరితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కాంగ్రెస్ పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది అది తేలకముందే ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. కేంద్రం మీద నిందలు వేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘బీసీలను తమ ప్రయోజనాల కోసం రాజకీయ అస్త్రాలుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వాడుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి వద్దకు బిల్లు పంపి చేతులు దులుపుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం మంత్రివర్గ తీర్మానం చేయడం బీసీలను వంచించడమే. షెడ్యూల్-9లో పొందుపరిస్తేనే రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది. మీరు పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. అది తేలకముందే ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏమిటి?. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో బిల్లు ఉంటే గవర్నర్ ఆమోదిస్తారా?. ఒకవేళ ఆమోదించిన కోర్టులలో నిలబడతాయా?.
కాంగ్రెస్ పార్టీ చేసిన కుల సర్వే తప్పులతడకగా ఉంది. కేంద్రం మీద నిందలు వేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తుంది. బుర్ర వెంకటేశం నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ గణాంకాలు ఎందుకు బయట పెట్టడం లేదు?. ఎంతమంది బీసీలు ఉన్నారనే లెక్క ముఖ్యం కాదు. బీసీ కులాల్లో ఎంతమందికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కిందో చెప్పాలి. ఈ వివరాలను దాచిపెట్టడం బీసీలను మోసం చేయడమే అవుతుంది.
వికాస్ కిషన్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే దీనికి ట్రిపుల్ టెస్ట్ అవసరమని సుప్రీం వెల్లడించింది. 50% రిజర్వేషన్లకు మించి వద్దని సుప్రీంకోర్టు చెబుతోంది. దాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తగ్గించి వారికి అన్యాయం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్లు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.