సాక్షి, తిరుపతి: రెండేళ్ల కూటమి పాలనపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, విధ్వంస పాలన ఎవరిదో ఆధారాలతో సహా రుజువు చేస్తానని తిరుపతి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు దీటుగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి బదులిచ్చారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సభకు అపనమ్మకపు సభ, సంక్షోభ సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేదని, ఈ సభ ద్వారా మరోసారి చంద్రబాబు ప్రజలకు మాయా బజార్ సినిమా చూపించాడని ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా విజన్ 2047 పేరుతో ప్రజలను మరోసారి భ్రమల ప్రిజన్‌లో బంధించాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి పాదాల చెంత మరోసారి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారని, "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో కూటమి నిర్వహించిన సభను నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాన్‌ల చెక్క భజన సభ అని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేక కేవలం జగన్ ని తిట్టడానికి రూ.20 కోట్లు ఖర్చు చేశారని భూమన ధ్వజమెత్తారు.
చంద్రబాబు అరాచక రాక్షస పాలనకు, వెన్నుపోటు, అంతులేని అవినీతికి రెండేళ్లు పూర్తయ్యానని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, చెప్పుకున్న చంద్రబాబు.. తన తప్పు లేకుంటే సీఐడీతో కేసులు ఎందుకు కొట్టేయించుకున్నాడని ప్రశ్నించారు. శ్రీవాణి టికెట్ల అమ్మకాలు, పరకామణి వ్యవహారం, డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
అందుకే జగన్‌పై అక్కసు వెళ్లగక్కారు
చంద్రబాబు పరిపాలనా దక్షుడు కాదు.. వెన్నుపోటు వీరుడు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, ఈనే తేడా లేకుండా తప్పించుకోలేని విధంగా తన రెండేళ్ల పాలనలో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచాడు. "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో కూటమి నాయకులు వైయస్ జగన్ గారిని తిట్టడానికే పరిమితమయ్యారు తప్ప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు గురించి మాత్రం స్పష్టంగా సమాధానం చెప్పడం లేదు.
మరోసారి పచ్చి అబద్ధాలు..
ఆఖరుకి తిరుమల శ్రీవారి పాదాల చెంత మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన వైఫల్యాలకు జగనే కారణమని ఊదరగొడుతున్నాడు. "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో నిర్వహించిన ఈ సభకి అపనమ్మకపు సభ, అబద్ధపు సభ, సంక్షోభ సభ, అనాగకరిక సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేది. 10 వేల మంది కూడా పట్టని ఆ ప్రాంతంలో 50 వేల మందితో సభ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేసుకుని పదుల కోట్ల రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేశారు.

మరోసారి మాయా బజార్ సినిమాని చూపించారు
వైఎస్ జగన్ పట్ల ఉన్న అక్కసు తీర్చుకోవడానికే ఈ సభను నిర్వహించారు. చంద్రబాబు అరాచక రాక్షస పాలనకు, వెన్నుపోటుకి, అన్యాయానికి, అంతులేని అవినీతి, దోపిడీ దౌర్జన్యాలకు మాత్రమే రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్ల పాలనలో ఆద్యంతం జగన్ పట్ల ద్వేషమే చూపించారు. ఈ సభ ద్వారా మరోసారి మాయా బజార్ సినిమాని చూపించారు. ఎర్ర బుక్కు పేరుతో చేసిన వెర్రి చేష్టలు తప్ప చేసిందేమీ లేదు. నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాన్‌లు.. చరకుడి వారసులమని చెప్పుకున్న చెక్క భజన సభ ఇది. వైఎస్ జగన్ గురించి అవాకులు చవాకులు పేలుతున్న చంద్రబాబు కొడుకు పేరు లోకేష్ కాదు.. పాపేష్, ఎర్ర బుక్కు ఎల్లేష్. తాను పప్పు అనే సంగతి లోకేష్ మరిచిపోయినా రెండు దశాబ్దాలుగా చూస్తున్న గూగుల్ మరిచిపోదు. రాబోయే రోజుల్లో తన తల్లిదండ్రులనే మర్చిపోతాడేమో.
ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశారు
తెలుగుదేశం అంటేనే వెన్నుపోటు పార్టీ. హంతకుల పార్టీ అని ఆనాడు గద్దర్ అన్నదే నిజమైంది. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేకపోయినా అన్ని చేసేశామని సిగ్గులేకుండా చెప్పుకున్నాడు. ఇద్దర్ని పిలిపించి భజన చేయించుకున్నాడు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల గురించి రాష్ట్రమంతా గగ్గోలు పెడుతోంది. 23 లక్షల పెట్టుబడులు, ఉద్యోగాలు అన్ని ఉత్తమాటలే. రెండేళ్లలో చేసిన రూ.3.60 లక్షల కోట్ల అప్పులే నిజం.
వైఎస్ జగన్ డీబీటీ ద్వారానే నేరుగా రూ.2.73 లక్షల కోట్లు లబ్ధిదారుల అకౌంట్‌లో జమ చేశాడు. కానీ చంద్రబాబు జగన్ ఇచ్చిన హామీలతో పాటు సూపర్ సిక్స్ అమలు చేస్తానని నమ్మించి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశాడు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాడు. విద్యా వ్యవస్థ నాశనం చేశాడు. మహిళలకు ఉచిత బస్సు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను కూడా 20 శాతం కూడా అమలు చేయలేదు. అయినా 2047 పేరుతో ప్రజలను భ్రమల ప్రిజన్‌లో ఉంచుతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎవరికీ అర్థం కాలేదు. ఏదో మీటింగ్ కోసం రాసుకున్న ప్రసంగాన్ని ఇక్కడ చదివినట్టుంది. పవన్ కళ్యాన్ తన స్వార్థం చూసుకుంటున్నాడని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఆయనకు దూరంగా జరిగింది. వారిప్పుడు ఆయన మాటలను నమ్మడం లేదు.
సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
చంద్రబాబు నియమించిన సిట్ నివేదికే తిరుమల లడ్డూ విషయంలో మా తప్పేమీ లేదని తేల్చింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చంద్రబాబుకి మొట్టికాయలు వేసింది. అయినా ఇంకా లడ్డూని అపవిత్రం చేశామని మాపై నిందలు వేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తప్పతాగి కొంతమంది రౌడీలు గూండాల మాదరిగా తన్నుకున్నారు. స్త్రీ లోలుడైన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన చంద్రబాబే ఆలయ ప్రతిష్టను దిగజార్చేస్తున్నాడు.
గతంలో ప్రతి సభలో కనిపించిన బీఆర్ నాయుడు ఇప్పుడెందుకు చంద్రబాబు పక్కన కనిపించడం లేదు? కొండ మీద మందు బాటిళ్లు కూడా కూటమి పాలనలో దొరికాయి. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చడమే కాకుండా గంజాయి, ఎర్రచందనం స్మగ్మర్లను తిరుపతిలో పెంచి పోషిస్తున్నది చంద్రబాబే. తిరుపతిలో అరాచకం రాజ్యమేలుతోంది.
కేసులను ఎదుర్కోకుండా ఎందుకు కొట్టేయించుకున్నారు?
డీఎస్సీ 2025కింద టీచర్ ఉద్యోగాల భర్తీ పేరుతో ఒక్కో ఉద్యోగం రూ. 15 నుంచి రూ. 20 లక్షలకు అమ్మేసుకున్నాడు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా వైయస్ జగన్ గారు వెలికితీస్తే ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన సమాధానం లేదు. శాప్ చైర్మన్ స్పోర్ట్స్ కోటా సీట్లను అమ్మేసుకుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్టు చేశారని చెప్పుకున్న చంద్రబాబు.. ఆ కేసులను ఎత్తివేయించడానికి సీఐడీని ప్రలోభ పెట్టకుండా ఉండాల్సింది. అవి తప్పుడు కేసులైతే న్యాయస్థానాల్లో ఎందుకు పోరాడలేదు? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కోరే దమ్ముందా? పరాకామణి విషయంలో, కొండ మీద జరిగే అక్రమాలపై, శ్రీవాణి టికెట్ల గోల్‌మాల్‌పై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? చంద్రబాబు కోరినట్టు బహిరంగ చర్చకు నేను సిద్దమే. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తా.
కూటమి దుష్ట పాలనపై పోరాటం ఆపే ప్రసక్తే లేదు
చంద్రబాబు దుర్మార్గ, దుష్ట, పాపపు పాలన అంతం చేయడానికి వైయస్సార్సీపీ నిర్వహించిన నిరసనలకు మహిళలు సహా ప్రజలు పోటెత్తారు. పోలీసుల ఆంక్షలను కూడా పట్టించుకోకుండా ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు మోసపు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. కనీసం 5 వేల మందికిపైగా వైయస్సార్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చిన్నపోస్టు పెడితే చాలు పోలీస్ స్టేషన్లు తిప్పిస్తున్నారు. ఇలాంటి వారు వైయస్సార్సీపీ విధ్వంస పాలన అని మాట్లాడటం హేయం. ఎన్ని అణచివేతలకైనా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదు. వెన్నుపోటు పాలనకు చరమ గీతం పాడే వరకు పోరాటం ఆపేది లేదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.


