
ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్
నర్సరావుపేట ఎంపీ లావుతో ఎమ్మెల్యేల విభేదాలు
ఏ ఒక్కరితోనూ లావుకు సఖ్యత లేదు
కేంద్ర మంత్రి పెమ్మసానిపై పలువురు గుర్రు
తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం
విజయవాడలో కేశినేని చిన్ని హవా
లోకేశ్ అండతో అన్ని నియోజకవర్గాల్లోనూ జోక్యం
విశాఖలో ఎంపీ భరత్‌కే ప్రాధాన్యం.. రగిలిపోతున్న ఎమ్మెల్యేలు
నెల్లూరులో వేమిరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. తమ మాటే వినాలని అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. పోస్టింగ్‌లు, కాంట్రాక్టులు, ఇతర పనుల్లో తమ మాటే నెగ్గాలని ఎవరికి వారు పట్టుబడుతుండడంతో వారి మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఈ విభేదాలు మరింత ముదిరిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ఎంపీల పెత్తనం ఎక్కువ కావడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోకేశ్ అండతో ‘చిన్ని’కిచినికి గాలివాన..!
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తాను లోకేశ్ మనిషినంటూ నియోజకవర్గాల్లో అన్నింటికీ తనకు వాటా ఉండాలని పట్టుబట్టి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇసుక ర్యాంపులు, మద్యం షాపులు, కాంట్రాక్టుల కోసం ఎక్కడికక్కడ తన మనుషులను పెట్టి వారితో వ్యవహారాలు నడిపిస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో చిన్నచిన్న విషయాల్లోనూ వేలు పెడుతుండడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనను వ్యతిరేకిస్తే లోకేశ్‌తో ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో ఎవరూ బయటపడడం లేదని, కేశినేని చిన్ని తీరు అన్యాయంగా ఉందని వాపోతున్నారు.
మా‘లావు’ చిక్కులు
నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటూ తన మాటే నెగ్గాలని పట్టుబడుతుండడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నిచోట్లా ప్రత్యేకంగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారితో పనులు చేయించేందుకు యత్నిస్తుండడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే గురజాల, నర్సరావుపేట సీట్లను తాను చెప్పిన వారికి ఇప్పించేందుకు యత్నించినా గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, నర్సరావుపేటలో అరవింద్‌బాబు సీట్లు తెచ్చుకుని గెలిచారు. ఆ తర్వాత కూడా వారితో లావు విభేదాలు కొనసాగిసూ్తనే ఉన్నారు.
నర్సరావుపేటలో జనసేన ఇన్‌చార్జిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన మర్రి రాజశేఖర్‌ను చేరదీయడంతో ఆయన వర్గం రగులుతోంది. మాచర్లలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని పక్కనపెట్టి తన మనుషులతోనే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తనకు మంత్రి పదవి రాకుండా లావు అడ్డుకున్నారనే కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవరాయలుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సిఫార్సుల ‘పెమ్మసాని’
గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరులోని తెనాలి, తాడికొండ నియోజవర్గాల్లో బదిలీలు, పనులకు ఆయన ప్రత్యేకంగా సిఫారసు లేఖలు ఇస్తుండడంతో ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెనాలిలో ఒక విద్యుత్ ఏఈ పోస్టు కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వేర్వేరు వ్యక్తులను సిఫారసు చేస్తూ లేఖలు ఇవ్వడంతో ఎవరి చెప్పినట్లు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు.
తగ్గ‘వేమిరెడ్డి’!
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు జిల్లా అంతా తనదేనంటూ అన్నింట్లో జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఆయనకు సీఎం తనయుడు లోకేశ్ అండ ఉండడంతో మైనింగ్ వ్యవహారాల్లో ఆయన చెప్పినట్లే జరుగుతోంది. మైనింగ్ డీడీగా తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని తాను చెప్పినట్లు వినేలా చేసుకున్నారు. దీంతో ఆయన తమ మాట కూడా వినకుండా ఎంపీ ఏది చెబితే అది చేస్తున్నారని ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. సర్వేపల్లి, వెంకటగిరి, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీకి ఏమాత్రం పొసగడంలేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించిన అక్రమ మైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి విజిలెన్స్ దాడులు చేయించినట్లు సమాచారం.
విశాఖలో ‘భరత్’నాట్యమే!
విశాఖపట్నం ఎంపీ భరత్ సీఎం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని విషయాలూ తనకు తెలియాలని, తనకు చెప్పి చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యవహారాలు, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)కి చెందిన పనులకు సంబంధించి ఆయన పెత్తనం చేస్తుండడంతో ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారు. భరత్ వ్యవహార శైలిపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడుతున్నట్లు సమాచారం. అన్ని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటుండడంతో మిగిలిన ఎమ్మెల్యేలు పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా రగిలిపోతున్నారు.