ఐపీఎస్‌లూ జాగ్రత్త!

Bandi Sanjay Warns IPS officers Over MP Dharmapuri Arvind Attack - Sakshi

వచ్చేది మా ప్రభుత్వమే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరిక 

సాక్షి, నిజామాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ఐపీఎస్‌ అధికారులు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. తెలంగాణలో నిజాంను మించిన అరాచక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాది మాత్రమే ఉంటుందని, ఆ తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలో మంగళవారం ఎంపీ అర్వింద్, బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు బండి సంజయ్‌ గురువారం జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు గూండాలను పెంచిపోషిస్తే చరిత్ర హీనులవుతారన్నారు. కేసీఆర్‌ మోచేతి నీళ్లు తాగుతున్న కొందరు ఐపీఎస్‌ అధికారులు ఇష్టం వచ్చినట్లు దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంపీ అర్వింద్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తిరిగే వీలు లేనివిధంగా నిజామాబాద్‌ సీపీ వ్యవహరించి హక్కులకు భంగం కలిగించారన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన సీపీ, ఎంపీని వెనక్కు వెళ్లాలని చెప్పడమేమిటన్నారు.

దాడికి పాల్పడిన నేరస్తులు బహిరంగంగా తిరుగుతుంటే ఇప్పటివరకు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదన్నారు. దీన్ని బట్టి సీపీ నేతృత్వంలోనే ఎంపీపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఎంపీపై దాడి జరిగితే ముఖ్యమంత్రి ఎలాగూ మాట్లాడరు.., కనీసం డీజీపీ సైతం స్పందించలేదన్నారు. మరోవైపు రైతులు దాడి చేసినట్లు బుకాయిస్తున్నారన్నారు. పంజాబ్‌లో మాదిరిగా రైతుల పేరుతో ప్రధానిపై దాడికి యత్నించిన ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో టీఆర్‌ఎస్‌కు సంబంధాలు ఉన్నాఏమో కేసీఆర్‌ చెప్పాలన్నారు.

ఇప్పటికే కరీంనగర్‌లో తనపై పోలీసుల నిర్వాకానికి సంబంధించి ఫిబ్రవరి 3న పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట సీఎస్, డీజీపీ హాజరు కావాల్సి ఉందన్నారు. కాగా, అర్వింద్‌పై జరిగిన దాడి గురించి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ తమకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారని, అర్వింద్‌ను పరామర్శించారని సంజయ్‌ చెప్పారు.  

గవర్నర్‌నూ గౌరవించడంలేదు.. 
కేసీఆర్‌ ప్రభుత్వం గవర్నర్‌ను సైతం గౌరవించని విధంగా సంస్కారహీనంగా తయారైందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. గవర్నర్‌ అన్నింటికీ తలూపకుండా ప్రశ్నిస్తే చెడ్డవారిగా టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల ఓటమి నేపథ్యంలో కేసీఆర్‌ నిస్పృహలో ఉన్నారన్నారు. ప్రజలు రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సీఎం తమ పార్టీ నాయకులపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. బీజేపీ ఎదురు దాడులు చేయడం ప్రారంభిస్తే కేసీఆర్‌ కుటుంబం అన్నీ సర్దుకుని పరార్‌ కావాల్సిందే అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top