కేసీఆర్‌ రూపొందించిన సినిమా అట్టర్‌ ప్లాప్‌: బండి సంజయ్‌ 

Bandi Sanjay Slams TrS Government Over Minister Srinivas Goud Issue - Sakshi

కుట్ర తేలేదాకా వదిలిపెట్టం

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర అంటూ కేసీఆర్‌ రూపొందించిన సినిమా అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా... కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైందన్నారు. ఎఫ్‌ఐఆర్‌ లేదా రిమాండ్‌ రిపోర్ట్‌లో ఎక్కడా బీజేపీ నేతలు డీకే ఆరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి పేర్లు లేకపోయినా టీఆర్‌ఎస్‌ నేతలు వారిపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు.

గురువారం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తామని, మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎన్నికల వ్యూహకర్త పాత్ర ఏమిటి? సీఎం స్వయంగా ఈ కుట్రకు తెరదీశారా? అనే దానిపైనా విచారణ జరపాలన్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రిని కాపాడబోయి సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కొందరు ఐపీఎస్‌లు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధ కలుగుతోందని, ప్రభుత్వం కొమ్ము కాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎవరైతే మంత్రి అక్రమాలపై పూర్తి ఆధారాలతో కోర్టులు, ఎన్నికల కమిషన్‌ను.. తమ హత్యకు కుట్ర జరుగుతోందని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారో వారే హత్యకు కుట్ర పన్నారంటూ పోలీసులు కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. నిర్మల్‌లో సాజిద్‌ ఖాన్‌ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని ఆశ చూపి అత్యాచారం చేస్తే పట్టుకోడానికి పోలీసులకు వారం రోజులు పడితే, మంత్రి హత్యకు కుట్ర పన్నారంటూ ఒక్కరోజులోనే ఢిల్లీపోయి కొందరిని పట్టుకొచ్చారని అన్నారు.

చదవండి: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి రియాక్షన్‌

రాష్ట్ర పోలీసుల తీరుపై తాము ఫిర్యాదు చేస్తే ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారని, ఈ విచారణను రాష్ట్ర పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కనీస సోయి కూడా లేదా? అని నిలదీశారు. ‘ఢిల్లీలో కిడ్నాప్‌నకు గురైన వారి అకామిడేషన్‌ నా పేరు మీదే ఉంది. ప్రజల్లో తిరిగే వాళ్లం. ఎవరైనా ఢిల్లీకి వస్తే వాళ్లకు ఆశ్రయమిస్తాం. భోజనం పెడతాం’అని ఒక ప్రశ్నకు సంజయ్‌ బదులిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, రవీంద్రనాయక్, జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.   

చదవండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్ర: ‘కిడ్నాప్‌’ల వ్యవహారంలో సంచలన మలుపు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top