మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్ర: ‘కిడ్నాప్‌’ల వ్యవహారంలో సంచలన మలుపు

Minister Srinivas Goud Assassinated Conspiracy Speculation In Kidnap - Sakshi

పాలమూరులో వ్యక్తుల అదృశ్యం, అరెస్టుల వెనుక కొత్త కోణం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర జరిగిందన్న పోలీసులు

విపక్ష నేతలు, నిందితుల బంధువుల నుంచి భిన్నవాదనలు

23, 24 తేదీల్లో కిడ్నాపైన వారు 25న హత్యా ప్రయత్నం ఎలా చేశారని సందేహాలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు పట్టణానికి చెందిన పలువురి కిడ్నాప్, అదృశ్యం, అరెస్టుల వ్యవహారం సంచలన మలుపు తీసు కుంది. వారం రోజులుగా మహబూబ్‌నగర్, హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో చోటు చేసుకున్న వరుస అపహరణ ఘటనల వెనుక కొత్త కోణం వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన సదరు వ్యక్తులు.. ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నారని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించడంతో కలకలం మొద లైంది. ఈ కుట్రలో బీజేపీ నేతలు జితేందర్‌ రెడ్డి, డీకే అరుణ అనుచరుల హస్తమున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీపీ వెల్లడించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే పోలీసులు అరెస్టు చేసిన నిందితులకు మంత్రిని హత్య చేసేంత ధైర్య ముందా? అన్న సందేహాలను జిల్లాలోని విపక్ష నేతలు, నిందితుల బంధువులు వ్యక్తం చేస్తున్నారు. 

నిందితుల్లో నలుగురు అన్నదమ్ములే.. 
మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్‌రాజుతో పాటు మహబూబ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అమరేందర్‌రాజు, మధుసూదన్‌రాజు, నాగరాజు, భండేకర్‌ విశ్వనాథరావు, తెలంగాణ ఉద్యమ కారుడు మున్నూరు రవి, వరద యాదయ్య కలిసి మంత్రి హత్యకు కుట్రపన్నారని పోలీసులు ప్రకటిం చారు. వీరిలో అమరేందర్‌రాజు, మధుసూదన్‌ రా జు, నాగరాజు, రాఘవేందర్‌రాజు నలుగురూ అన్న దమ్ములే. ఇందులో సుపారీ గ్యాంగ్‌కు డబ్బులు ఇచ్చేందుకు మధుసూదన్‌రాజు, అమరేం దర్‌రాజు ముందుకొచ్చారని పోలీసులు  చెప్తున్నారు. 

మొదటి నుంచీ విభేదాలతో..: మంత్రి హత్య కేసులో నిందితులుగా చేర్చిన నలుగురు అన్నదమ్ములకు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మొదటి నుంచీ విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన అమరేందర్‌రాజు.. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన భార్య రాధ గతంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరిన కొన్నిరోజుల తర్వాత అమరేందర్‌రాజు కుటుంబం.. శ్రీనివాస్‌గౌడ్‌తో అంటీముట్టనట్టుగానే ఉన్నట్టు ప్రచారంలో ఉంది. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్‌ తప్పుడు అఫిడవిట్‌ వేశారని, తర్వాత స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపర్‌ చేసి వివరాలు మార్చారని రాఘవేందర్‌రాజు ఫిర్యాదు చేశారు. 2019 జనవరి 24న కోర్టులో కేసు కూడా వేశారు.

శ్రీనివాస్‌గౌడ్‌ను డిస్‌క్వాలిఫై చేసి, ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆ కేసు 2020 మార్చి 24న విచారణకు వచ్చినా.. కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. ఈ క్రమంలో రాఘవేందర్‌రావు.. 2021 ఆగస్టు 2న కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ)కు ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన సీఈసీ.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. ఇటీవల సీఈవో శశాంక్‌ గోయల్‌ కేంద్ర సర్వీసులోకి వెళ్లిన క్రమంలో.. ఈసీ వెబ్‌సైట్‌ ట్యాంపరింగ్‌పై నిజానిజాలు తేల్చాలని సాంకేతిక బృందానికి సీఈసీ ఆదేశించినట్టు తెలిసింది. కాగా.. నెల క్రితం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌ నగ ర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాజకీయంగా ఎదుగుతున్నందున కక్ష గట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని.. దుష్ప్రచారం వెనుక ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ హస్తం ఉందని మండిపడ్డారు.

అనుమానాలున్నాయి: బంధువులు
నాగరాజు, భండేకర్‌ విశ్వనాథరావు, యాదయ్యను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లారని 23, 24వ తేదీల్లో వారి భార్యలు మహబూబ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు 25వ తేదీన ఫరూక్, హైదర్‌ అలీలను హత్య చేసేందుకు ప్రయత్నించారని, 26న అరెస్ట్‌ చేశామని పోలీసులు వెల్లడించడంపై అనుమానాలు ఉన్నాయని నిందితులు బంధువులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమ వారిని చర్లపల్లి జైలుకు పంపిన తర్వాతే పోలీసులు సమాచారం ఇచ్చారని.. తీరా జైలు వద్దకు వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు జాప్యం చేసి ములాఖత్‌ ఇచ్చారని నాగరాజు, యాదయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న కొన్ని తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తమ వారిపై ఇలా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తంపై ఆరోపణలు వస్తుండటంతో.. రాజకీయ రచ్చకు తెరతీసినట్లేనని జిల్లాలో చర్చ జరుగుతోంది.

ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాగంటే..

  • మహబూబ్‌నగర్‌ పట్టణంలోని బీకేరెడ్డి కాలనీకి చెందిన చలువగాలి నాగరాజును గత నెల 23న రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీ సమీపంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని.. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ లేదని నాగరాజు భార్య గీత అదేరోజు సాయంత్రం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరుసటి రోజు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు.
  • 24న మహబూబ్‌నగర్‌కు చెందిన మైత్రి ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడు వరద యాదయ్యను ఇద్దరు వ్యక్తులు షాప్‌ వద్దకు వచ్చి ప్రింటింగ్‌ ఆర్డర్‌ ఇస్తామంటూ బయటికి పిలిచి ఎత్తుకెళ్లినట్లు ఆయన భార్య సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
  • 24వ తేదీనే పట్టణానికి చెందిన మరో వ్యక్తి భండేకర్‌ విశ్వనాథరావును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ ఆయన భార్య పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • అయితే ఈ ముగ్గురినీ మంత్రిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసినట్టు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు 26వ తేదీన ప్రకటించారు.
  • 28న ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో.. మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు మున్నూరు రవి, జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ థాపాతోపాటు రాఘవేందర్‌రాజు, మధుసూదన్‌రాజులను అదుపులోకి తీసుకుని బుధవారం అరెస్టు చూపించారు. 

ఇమేజ్‌ కోసం అల్లిన కథ 
ఇది శ్రీనివాస్‌గౌడ్‌ తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు అల్లిన కథ. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలపై ఆరోపణలు చేసి ఇమేజ్‌ పెంచుకోవాలని కుట్రలు చేయడం తగదు. ఎన్నికల అఫిడవిట్‌ను మార్చిన విషయంలో తనకు వచ్చిన ఇబ్బందులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి హత్యకు కుట్ర కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సుపారీ ఇచ్చేంత డబ్బులు విశ్వనాథ్‌ భండేకర్, మున్నూర్‌ రవి, యాదయ్యలకు ఎక్కడివి? 
– వీరబ్రహ్మచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు  

నా భర్తను ఇరికించారు 
నా భర్త మైత్రి యాదయ్యను కుట్ర పూరి తంగా కేసులో ఇరికించారు. ఆయనకు ఏ పాపం తెలియదు. హత్యలు చేసేంత క్రూరుడు కాదు. మంత్రికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో కక్ష పెంచుకుని కేసులో ఇరికించారు.  – నాగమణి, మైత్రి యాదయ్య భార్య 

మా అక్క షాక్‌లో ఉంది... 
మా అక్క షాక్‌లో ఉంది. చక్కర వచ్చి పడిపోయి ప్రస్తుతం ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేదు. మూడు రోజులుగా ఏమీ తినలేదు. మాకు ఏమీ అర్థం అవ్వడం లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. – అనిల్‌ (విశ్వనాథ్‌ భండేకర్‌ బావమరిది)  

మంత్రి హత్యకు కుట్ర దారుణం 
తెలంగాణలో హత్యా రాజకీయాలకు చోటు లేదు. జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్‌ హత్యకు కుట్ర చేయడం దారుణం. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. 

– డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top