మమత వ్యాఖ్యలపై ఎంఐంఎం చీఫ్‌ ఆగ్రహం

Asaduddin Owaisi Slams Said No Man Can Buy Him - Sakshi

ముస్లిం ఓట్లు ఏమైనా మీ జాగిరా?: ఒవైసీ

కోల్‌కతా: ముస్లింలను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ హైదరాబాద్‌ నుంచి ఒక పార్టీని తీసుకువచ్చింది అంటూ ఎంఐఎంపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మండి పడ్డారు. డబ్బుతో అసద్‌ని కొనే మనిషి ఇంకా పుట్టలేదని స్పష్టం చేశారు. అంతేకాక ముస్లిం ఓట్లు మమత జాగిరు, ఆస్తులు కాదని మండిపడ్డారు. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ మాట్లాడుతూ.. ‘డబ్బుతో నన్ను కొనే మనిషి ఇంతవరకు పుట్టలేదు. ఆమె(మమతా బెనర్జీ) ఆరోపణలు అవాస్తవాలు. ఆమె ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆమె పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారు. సొంత రాష్ట్రంలోనే ఆమె భయపడుతున్నారు. బిహార్‌ ఓటర్లును, మాకు ఓటు వేసిన ప్రజలను ఆమె అవమానించారు. గతంలో పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఓటు కట్టర్లు అని ఆరోపిస్తే.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో గుర్తు పెట్టుకొండి. ముస్లిం ఓట్లు ఏమైనా మీ జాగీరా’ అంటూ ఒవైసీ తీవ్రం​గా విరుచుకుపడ్డారు. (చదవండి: మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ)

"ఇప్పటివరకు మీరు మీకు విధేయులైన మీర్ జాఫర్స్, సాదిక్‌లతో మాత్రమే వ్యవహరించారు. తమ గురించి ఆలోచించే, మాట్లాడే ముస్లింలను మీరు ఇష్టపడరు. బిహార్‌లోని మా ఓటర్లను మీరు అవమానించారు. ముస్లిం ఓటర్లు మీ జాగీర్ కాదు'' అని తృణమూల్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. వచ్చే ఏడాది బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో కూడా ఎంఐంఎం పోటీ చేయాలని భావిస్తోన్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top