గ్రామాల్లో ఆస్తి పన్ను ఏటా 5 శాతం పెంపు జీవో బాబు సర్కారుదే

AP: Chandrababu Govt Raised Property tax In Villages By 5 Percent Annually - Sakshi

అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రకారమే ఇంటి పన్ను నిర్ధారణ

టీడీపీ హయాంలో ఏటా ఇంటి పన్ను పెరుగుదల

నాడు ఐదేళ్లలో మూడు రెట్లు వడ్డన

ఇప్పుడేదో కొత్తగా పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను (ఇంటి పన్ను) ఏటా ఐదు శాతం చొప్పున పెంచాలని 2002లో చంద్రబాబు సర్కారు జీవో 98 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ప్రకారం అధికారుల స్థాయిలోనే గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏటా ఇంటి పన్ను పెంచుకుంటూ వెళ్లింది. ఐదేళ్లలో పెంచిన ఇంటి పన్నుల భారం రూ.266 కోట్లు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు సర్కారు తెచ్చిన జీవో ప్రకారమే ఈ ఏడాది కూడా గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తున్నా రాజకీయ విమర్శలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేదో ప్రజలపై కొత్తగా పన్ను భారం మోపుతున్నట్లు అపోహలు సృష్టించేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తున్నాయి.

ఐదేళ్లలో మూడు రెట్లు పెరుగుదల...
2013–14లో ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాల్లో మొత్తం గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు లక్ష్యం రూ.157.96 కోట్లు కాగా 2018–19 నాటికి రూ.423.69 కోట్లకు చేరుకుంది. అంటే ఐదేళ్లలో ఇంటి పన్ను లక్ష్యం దాదాపు మూడు రెట్లు పెరిగింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే కూడా అధికంగా గత సర్కారు ఇంటి పన్ను భారం మోపింది.
చదవండి: విద్యుత్‌ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి 

నాటి జీవో ప్రకారమే..
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇంటి విలువపై రూ.వందకు 12 పైసల నుంచి ఒక్క రూపాయి మధ్య ఇంటి పన్నును సంబంధిత గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకొని నిర్ధారించుకోవచ్చు. 2000–2001లో ఇంటి విలువ ఆధారంగా ప్రస్తుతం పన్ను నిర్ధారణ జరుగుతోంది. అప్పుడు నిర్ధారించిన ఇంటి పన్ను ఏటా ఐదు శాతం చొప్పున పెరుగుతోంది. కొత్తగా ఇంటి విలువ నిర్ధారణ జరిగే వరకు 2000–2001 నాటి ఇంటి విలువ ఆధారంగానే పన్ను వసూలు చేయాలని టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో 98లో పేర్కొన్నారు.

ఎన్నికల భయంతో ప్రయోగం వాయిదా
2017–18లో పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గత సర్కారు ప్రయోగాత్మకంగా అప్పటి ధరల ప్రకారం ఆస్తి విలువను నిర్ధారించి కొత్తగా ఇంటి పన్ను వసూలు చేసింది. ఈ నిర్ణయంతో ఒక్కో యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్ను ఒకేసారి రెండు రెట్లకు పైగా పెరిగినట్లు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో పశ్చిమ గోదావరి తరహాలోనే అప్పటి విలువ ఆధారంగా కొత్తగా ఇంటి పన్ను నిర్ధారణకు నాటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేశ్‌ కసరత్తు చేపట్టారు.
చదవండి: అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్‌

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇళ్లను కొత్తగా సర్వే చేసి అప్పటి విలువ ప్రకారం లెక్కకట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సర్వే ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటం, అసెంబ్లీ ఎన్నికల భయంతో ఇంటి పన్ను పెంపును గత సర్కారు తాత్కాలికంగా వాయిదా వేసింది. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2019లోనే పంచాయతీల్లో ఇంటి పన్ను రెండు మూడు రెట్లు  పెరిగేదని అధికారులు పేర్కొంటున్నారు. 

2014–19 గ్రామాల్లో ఇంటి పన్ను పెరిగిన తీరు

ఆర్థిక ఏడాది వసూలు లక్ష్యం రూ.కోట్లలో
2013–14 157.96 
2014–15 186.33
2015–16 257.95 
2016–17  299.60 
2017–18  369.40 
2018–19   423.69 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top