విద్యుత్‌ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి  | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి 

Published Mon, Oct 4 2021 4:51 AM

Center should repeal the Electricity Amendment Act - Sakshi

కృష్ణలంక (విజయవాడ తూర్పు): విద్యుత్‌ సవరణ చట్టం–2021ను ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని విద్యుత్‌ ఉద్యోగుల జాతీయ కో–ఆర్డినేషన్‌ కమిటీ జాతీయ కన్వీనర్‌ ప్రశాంత్‌చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

ముఖ్య అతిథి ప్రశాంత్‌చౌదరి మాట్లాడుతూ విద్యుత్‌ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలను సంప్రదించలేదన్నారు. అయితే ఫైనాన్స్‌ అడ్‌వైజరీ, ఫిక్కీ తదితర సంస్థ ప్రతినిధులు వంటి పెట్టుబడిదారుల ప్రతినిధులను సంప్రదించడం దారుణమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు.

ఇప్పుడున్న విద్యుత్‌ మీటర్ల స్థానంలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, అదే జరిగితే.. వినియోగదారులపై రూ.4 వేల అదనపు భారంతో పాటు, రీచార్జ్‌ చేయకుంటే వెంటనే విద్యుత్‌ ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ వలన వచ్చే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలకు సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యం, విద్యుత్‌ రంగాలపై రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించివేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.      

 
Advertisement
 
Advertisement