నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీలో వర్గాలు లేవు: అనిల్‌కుమార్‌యాదవ్‌

Anil Kumar Yadav Says No Disgruntlement In Nellore YSRCP - Sakshi

సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటే తనకు శిరోధార్యమని మాజీ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. నెల్లూరు కపాడిపాళెం వద్ద శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీలో ఎలాంటి వర్గాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న వారంతా వైఎస్‌ జగన్‌ సైనికులేనని తెలిపారు. తమకు గ్రూపులు కట్టాల్సిన అవసరం లేదని, అదంతా ఎల్లో మీడియా విష ప్రచారమని తేల్చి చెప్పారు. గడపగడపకూ కార్యక్రమంలో  ఉన్న నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపానన్నారు.

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డితో భేటీ కూడా అలాంటిదేనని చెప్పారు. మంత్రిగా ఉన్న సమయంలో సహకరించిన ఎమ్మెల్యేలను కలిస్తే తప్పా? వారికి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత తనది కాదా? తన పార్టీ ఎమ్మెల్యేలను కలవడం కూడా తప్పేనా అని నిలదీశారు. నెల్లూరులో ఏ ఫ్లెక్సీ చిరిగినా తనపై అపవాదు వేయడం రివాజుగా మారిపోయిందని, కార్పొరేషన్‌ యంత్రాంగం ఫ్లెక్సీలు తీసేసినా తనపై దు్రష్పచారం చేస్తున్నారని అనిల్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో వైఎస్సార్‌సీపీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఇప్పటికీ మంత్రి కాకాణి నెల్లూరు జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారు కాలేదన్నారు. ఈనెల 17న గాంధీ బొమ్మ సెంటర్‌లో నెల్లూరు సిటీ వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులతో సభ పెట్టుకోవాలని నిర్ణయించామని, దానిని కూడా ఓ వర్గం మీడియా రాద్ధాంతం చేస్తోందని అన్నారు. గడపగడపకూ కార్యక్రమం చేపట్టే సందర్భంగా సభ పెట్టుకుంటున్నామని తెలిపారు. మంత్రి కాకాణి స్వాగత ర్యాలీని అడ్డుకునేందుకే తన సభ అని దు్రష్పచారం చేస్తున్నారన్నారు. తనకు మంత్రి కాకాణికి విభేదాలున్నాయని ప్రచారం చేయడం తగదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top