
సాక్షి, గుంటూరు: కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తే బెదిరిపోయేది లేదని.. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు.
‘‘రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్‌ను అక్రమ కేసులతో జైలులో పెట్టి, ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైఎస్సార్‌సీపీ నేతలను, గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుంది. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
