చంద్రబాబుది పైశాచిక ఆనందం

Alla Nani Fires On Chandrababu - Sakshi

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దిగజారి మాట్లాడుతున్నారు 

అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నారు

బాబు హయాంలో ఒక్క వైద్య పోస్టునూ భర్తీ చేయలేదు

ప్రభుత్వ ఆస్పత్రులను, 108, 104,ఆరోగ్యశ్రీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు

ఇప్పటివరకు 16,86,446 మందికి కరోనా పరీక్షలు 

కరోనా నియంత్రణలో దేశంలోనే ఏపీకి ప్రత్యేక గుర్తింపు 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

సాక్షి, అమరావతి: బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత పదవిలో ఉండి చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ధ్వజమెత్తారు. కరోనా మరణాలపై ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మవద్దన్నారు. ఆయన హయాంలో ఒక్క వైద్య పోస్టునూ భర్తీ చేయలేదని విమర్శించారు. 108, 104లతోపాటు ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. సోమవారం ఆళ్ల నాని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రజారోగ్యం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృషిని ఓర్వలేక, విజ్ఞత మరిచి బాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా నియంత్రణలో దేశంలోనే ఏపీ ప్రత్యేక గుర్తింపు పొందిందని, అత్యధిక టెస్టులు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని అన్నారు. ఆళ్ల నాని ఇంకా ఏమన్నారంటే..

► కరోనా రోగుల కోసం 138 కోవిడ్‌ ఆస్పత్రులను, 105 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తెచ్చాం. ప్రతి జిల్లాలోనూ ఒక 104 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అనుమానితులు ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? పాజిటివ్‌ వస్తే ఎవరిని సంప్రదించాలి? అనే వివరాలు ఇక్కడ చెబుతారు.
► రాష్ట్రంలో 39,051 బెడ్లు, 1,513 వెంటిలేటర్లు, 8.60 లక్షల పీపీఈ కిట్లు, 7.02 లక్షల ఎన్‌–95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెలా కరోనా నియంత్రణ, నివారణకు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకు 16,86,446 మందికి కరోనా పరీక్షలు చేశాం.
► 49,558 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు.
► వైద్యులు, పారా మెడికల్‌ పోస్టులతోపాటు అదనంగా మొత్తం అన్నీ కలిపి 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం రూ.900 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చాం.
► ఏపీలో కరోనా నియంత్రణ చర్యల పట్ల కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజలు సానుభూతితో వ్యవహరించాలి..
► కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలి. కరోనాతో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతితో వ్యవహరించాలి. దహన సంస్కారాల పట్ల అపోహలను వీడాలి.
► ప్రైవేటు ఆస్పత్రుల్లోబెడ్లు లేవని చెబుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వెబ్‌సైట్‌ను సిద్ధం చేశాం. ఏ ఆస్పత్రిలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో అందరూ తెలుసుకునేలా దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 

వైద్యుల ఆత్మస్థైర్యాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారు
► వైద్యులు, పారిశుధ్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. 
► మాస్కులు, కిట్‌లు లేవు అంటూ వైద్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. 
► చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రష్టు పట్టించారు. 
► స్పెషలిస్ట్‌ వైద్యుల నుంచి ఆశా వర్కర్ల వరకు మా ప్రభుత్వం వేతనాలు పెంచిందన్న సంగతిని ఆయన గుర్తుంచుకోవాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top