గత పాలకులది విశ్వాసఘాతుకం

Advocate General Sriram Comments On Past TDP Govt - Sakshi

అవి యాదృచ్ఛిక కొనుగోళ్లు కానేకావు: ఏజీ

అమరావతి భూ కుంభకోణంపై తీర్పు వాయిదా.. సేల్‌డీడ్‌లు అందచేయాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్ల కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు బుధవారం ముగిశాయి. భూముల కొనుగోళ్ల డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ దీనిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ ప్రకటించారు. అంతకు ముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ రాజధానిపై తమకు కావాల్సిన వారికి లీకులివ్వడం ద్వారా గత పాలకులు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, సమాజాన్ని మోసగించారని హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్ణయానికి సంబంధించి అధికారిక రికార్డులు లేవని, వీలునామా రాసినట్లుగా, కుటుంబ ఆస్తులు పంపకాలు చేసుకున్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

రాజధాని నడిబొడ్డున, రింగ్‌రోడ్డు పక్కన, కీలక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం యాదృచ్ఛికం ఎలా అవుతుందన్నారు. దీని వెనుక భారీ కుట్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి భూములను కారుచౌకగా కొనేశారని, ఇదే విషయాన్ని  పోలీసుల ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రైవేట్‌ భూ కొనుగోళ్ల లావాదేవీలను నేర పరిధిలోకి తీసుకురావడం సబబేనా? అని ప్రశ్నించారు. నేరపూరిత కుట్ర ఉంది కాబట్టే కేసు నమోదు చేసినట్లు శ్రీరామ్‌ తెలిపారు. ఈ భూముల కొనుగోళ్లతో ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏముందని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించడంతో నష్టం అన్నది ఆర్థిక రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదని ఏజీ చెప్పారు. రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని అధికార ప్రకటనకు ముందే కొందరికి మాత్రమే వెల్లడించడం వల్ల సమాజంలో మిగిలిన వారు నష్టపోయారన్నారు.

ఇలాంటి చర్యలన్నీ ఆర్థిక నేరాల కిందకు వస్తాయని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ కోరితే ఇప్పటివరకు స్పందించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, కిలారు శ్రీహాస తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ అమరావతినే రాజధానిగా చేస్తారని 2014 మార్చి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని, పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని వివరించారు. నార్త్‌ఫేస్‌ హోల్డింగ్స్‌ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ రాజధానికి 8 కిలోమీటర్ల అవతల భూములు కొనుగోలు చేస్తే తప్పుబడుతున్నారన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top