● డీఎంపై కార్మికుల్లో అసంతృప్తి ● కొందరికి అనుకూలంగా.. ● మరికొందరిపై కక్షసాధింపు
మంథని: మంథని ఆర్టీసీ డిపో గతంలో ఎన్నడూ లేనివిధంగా పత్రికలకు ఎక్కుతోంది. ప్రస్తుత డిపో మేనేజర్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కొంతమందిని తప్ప అన్నిస్థాయిల్లో పనిచేస్తున్న కా ర్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే అరో పణలు వినిపిస్తున్నాయి. తనపై జరిగిన కుట్రకు సంబంధించి సమస్య పరిష్కరించమని అర్జీ పెట్టు కుంటే సరైన జవాబు ఇవ్వకుండా తన హక్కును డిపో మేనేజర్ కాలరాశారని ఏడీసీ(ఈ) కె.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ డి.శ్రీపాదరావు 31 సంవత్సరాల క్రితం మంథని ప్రజల అవసరాలను గుర్తించి 1997లో మంథనిలో డిపో ప్రారంభించారని అన్నారు. 320 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ చరిత్ర తెలుసుకోకుండా కొంతమంది మాటలు విని ప్రజాపాలనకు వ్యతిరేకంగా అఽధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ఒక్క నారాయణ అనే ఉద్యోగి కాకుండా చాలామంది కార్మికులను వేధిస్తున్న డిపో మేనేజర్ వ్యవహార శైలిపై ‘సాక్షి’ ఆరా తీయగా అనేక విషయాలను వెల్లడించారు. తమపేర్లను బయటకు రాకుండా చూడాలని, లేకపోతే తమ ఉద్యోగాలు పోతాయనే భయాన్ని వారు వ్యక్తం చేశారు. డిపో పరిధిలో ప్రజారవాణా మెరుగు, సంస్థకు ఆదాయం, డిపో అభివృద్ధి, కార్మికుల శ్రేయస్సు తదితర అంశాలపై అధికారులు, కార్మికులు సమన్వయంతో దృష్టి సారించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి నిజానిజాలు బయట పెడితేనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఈ విషయంపై డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఏడీసీ నారాయణ ఆరోపణలు నిరాధారమన్నారు. సదరు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.


