● బల్దియా వాహనాలతో పూడిక తీయండి ● రామగుండం మేయర్ మహంకాళి స్వామి
కోల్‌సిటీ(రామగుండం): బల్దియా సొంత వాహనాలతోనే కాలువల్లో పూడిక తీయిస్తూ నిధులు ఆదా చేయాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. కాంట్రాక్ట్ పేరిట రూ.కోట్లు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 40వ డివిజన్‌లో గురువారం కార్పొరేటర్ కజంపురం జయప్రద– రాజేందర్‌తో కలిసి మేయర్ వార్డు సందర్శన చేపట్టారు. ఏటా పూడిక తీతకు రూ.లక్షలు కేటాయిస్తూ తూతూమంత్రంగా పనులు చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దీనికి చరమగీతం పా డుతూ నిధులు వృథాకాకుండా బల్దియా సొంత వాహనాలు, పారిశుధ్య సిబ్బందితోనే ప్రధాన కాలువల్లో పూడికతీత చేపట్టామని ఆయన అన్నారు. ఉల్లిగడ్డల బజార్‌లో రామన్ వారధికి ఇరువైపులా పెద్ద మురుగునీటి కాలువలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పూడికను యంత్రాలతో తొలగించారు. ఆయన పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, డీఈ అఫ్తాబ్, ఏఈ జమీల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్ పాల్గొన్నారు.


