పెరుగుతున్న పత్తి ధర చివరిదశకు చేరిన దిగుబడి కొందరు రైతుల వద్ద ఇంకా నిల్వలు నిరాశలో ఇప్పటికే విక్రయించిన అన్నదాతలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పత్తి దిగుబడి చివరి దశకు చేరుతోంది. ఈక్రమంలో ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రతికూల పరిస్థితులు, చీడపీడల ఉధృతితో ఈసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. కానీ, చివరిదశలో ధర మెరుగ్గా ఉండడం అన్నదాతల్లో కొంత సంతోషం నింపుతుండగా.. ఇప్పటికే పత్తి విక్రయించిన వారిలో నిర్వేదం నెలకొంది.
48వేల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈసారి 48వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 5.78 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే, ఇప్పటివరకు అందులో సగం కూడా కొనుగోలు చేయలేకపోయారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు దిగుబడిపై ప్రభావం చూపడంతోనే ఆశించిన స్థాయిలో పంట చేతికి రాలేదన్న అభిప్రాయాలను పలువురు రైతులు వ్యక్తం చేశారు.
ఎకరాకు నాలుగు క్వింటాళ్లు మించలే..
అకాల వర్షాలతో పంటకు చీడపీడలు సోకాయి. గులాబీపురుగు లాంటివి పంటను ఆశించాయి. ఎకరాకి 12 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉందని భావించినా.. 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లు మించి దిగుబడి చేతికి అందే పరిస్థితి లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
కొనుగోలు చేసింది 2.58 క్వింటాళ్లే
జిల్లా వ్యాప్తంగా 48 వేల ఎకరాల్లో పత్తి సాగుకాగా.. 5.78 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనాకు వచ్చారు. కానీ ఈనెల 6వ తేదీ(సోమవారం) నాటికి అందులో సగమే కొనుగోలు చేశారు. కొనుగోళ్ల తీరు పరిశీలిస్తే.. దిగుబడిపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అక్కడక్కడా కొంతమేర మంచి దిగుబడి వచ్చినా.. ధర ఇంకా పెరగక పోతుందా? అనే ఆశతో కొంతమంది రైతులు తమ ఇళ్లలో పత్తి నిల్వ చేసుకోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకు సీసీఐ ద్వారా 1,57,380 క్వింటాళ్లు, ప్రైవేట్ వ్యాపారులు (మిల్లుల వద్ద) 43,885 క్వింటాళ్లు, మార్కెట్‌లో అడ్తిదారులు 56,569 క్వింటాళ్ల మేర కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్ అధికారులు తెలిపారు.
మంగళవారం నాటి ధరలు
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,011 ధర పలికింది. కనిష్టంగా రూ.5,818, సగటు రూ. 7,588గా ధర ఉందని అధికారులు వివరించారు.
జిల్లాలో ఈనెల 6వ తేదీ వరకు
పత్తి కొనుగోళ్లు(క్వింటాళ్లలో)
సీసీఐ కేంద్రాలు 1,57,380
ప్రైవేట్ సెంటర్లు 43,885
మార్కెట్‌యార్డు 56,569


