పట్టుబడినా ఆగని అక్రమార్కులు | - | Sakshi
Sakshi News home page

పట్టుబడినా ఆగని అక్రమార్కులు

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

● జిల్లాలో కొనసాగుతున్న ఏసీబీ దాడులు ● అయినా మారని అవినీతి తిమింగలాలు

ఈఏడాది ఫిబ్రవరి 20న మంథని సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్‌రిజిస్ట్రార్‌ కసర్లి రాజేందర్‌ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడితో పాటు ప్రైవేట్‌ డ్యాక్యుమెంట్‌ రైటర్‌ ఎండీ రీషీద్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన రైతు కన్నూరి బాపు వద్ద భూమి రిజిస్ట్రేషన్‌ కోసం రూ.16,500 లంచం డిమాండ్‌ చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు ట్రాప్‌ చేసి పట్టుకున్నారు.
● జిల్లాలో కొనసాగుతున్న ఏసీబీ దాడులు ● అయినా మారని అవినీతి తిమింగలాలు

పెద్దపల్లి మండల అగ్రికల్చర్‌ అధికారి కార్యాలయంలో ఈఏడాది ఫిబ్రవరి 24న ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. స్పూరియస్‌ (నకిలీ) విత్తనాలు, యూరియా అక్రమ నిల్వ, స్టాక్‌ రిజిస్టర్లు అప్‌డేట్‌ చేయకపోవడం, ఫార్మ్‌ మెకనైజేషన్‌ అప్లికేషన్లు ఆలస్యం చేయడం వంటి అంశాలు బయటపడటంతో ఎంఓఏ అలివేణిని సస్పెండ్‌ చేశారు.

తాజాగా గురువారం అంతర్గాం మండల తహసీల్దార్‌ కార్యాలయం ఆర్‌ఐ శ్రీమాన్‌, రాయదండి గ్రామానికి చెందిన మాచర్ల వెంకటస్వామి అనే సింగరేణి ఉద్యోగి నుంచి రూ.10వేలు లంచం డిమాండ్‌ చేశాడు. లంచం డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తండ్రి చనిపోతే తల్లిపేరుమీద ఽభూభారతిలో పేరు మార్చడానికి ఆరునెలలుగా తిప్పలు పెడుతుండడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వలపన్ని పట్టుకున్నారు.

గోదావరిఖని(రామగుండం): పట్టుబడుతున్నా అక్రమార్కుల అవినీతి దందా ఆగడం లేదు. వచ్చిన జీతంతో సంతృప్తి చెందక బల్లకింద చేతులు చాపుతున్నారు. అవినీతి సొమ్ముకు అలవాటు పడిన ప్రభుత్వాధికారులు వరుసగా ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగుతున్న ఏసీబీ అధికారులు పక్కాస్కెచ్‌తో లంచావతారులను పట్టుకుంటున్నారు. వివిధ శాఖల్లోని అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులతో ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. జిల్లాలో గడిచిన నాలుగునెలల్లో ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి. అయినా ఏదో ఒక ప్రాంతంలో లంచావతారులు తమ విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. అన్యాయంగా డబ్బులు డిమాండ్‌ చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. ప్రధానంగా తహసీల్‌ కార్యాలయం, రిజిస్ట్రేషన్లశాఖ, మున్సిపల్‌ కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈమేరకు ఆయా కార్యాలయాలపై దృష్టి సారించారు. ఈక్రమంలో నాలుగు నెలల్లో ముగ్గురు ఏసీబీకి చిక్కారు.

పట్టుబడుతున్నా మారని తీరు..

బల్లకింద చేయిచాచడం, ఇష్టానుసారంగా దోచుకోవడం కొంతమంది అధికారుల నైజంగా మారింది. పనిచేయాలంటేనే చేతులు తడపాల్సి రావడంతో అడిగినంత చెల్లించలేక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి తిమింగలాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. జిల్లాలో వరుస దాడులు జరుగుతున్నా లంచావతారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

ఫిర్యాదు చేస్తే రంగంలోకి..

అవినీతి తిమింగలాలను పట్టుకునేందుకు ఏసీబీ శాఖ ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసింది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని కోసం లంచం డిమాండ్‌ చేస్తే 1064టోల్‌ఫ్రీ నంబర్‌ కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది. ఫిర్యాదుదారు ల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు సత్వరమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది.

రెండేళ్లకోసారి.. అధికారుల తప్పుదారి

రామగుండం: అంతర్గాం తహసీల్దార్‌ కార్యాలయంలో రెండేళ్లకోసారి అధికారులు ఏసీబీ చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అంతర్గాం ప్రత్యేక మండలంగా ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో ఇద్దరు తహసీల్దార్లు, ముగ్గురు ఆర్‌ఐలు రెండేళ్లకు ఒకరు చొప్పున ఏసీబీకి చిక్కడం రెవెన్యూ అధికారుల అవినీతికి అద్దం పడుతోంది. ప్రధానంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చడం, తప్పొప్పులను సవరించడం, భూముల హద్దు పంచాయితీలు, సర్వే పనులను అధికారులు నిస్వార్థంగా చేపట్టి అసలైన పట్టాదారులకు న్యాయం చేయాల్సి ఉండగా, సంపాదనే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు సాధారణ ప్రజలను వేధిస్తున్నారు. 2022లో తహసీల్దార్‌, ఆర్‌ఐతో పాటు కార్యాలయ సహాయకుడు ఏసీబీ వలకు చిక్కగా, 2024లో మరో తహసీల్దార్‌, ఆర్‌ఐ, ప్రస్తుతం ఆర్‌ఐ ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం అధికారులు విపరీతంగా లంచాలు వసూలు చేస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులకు సంబంధించి వివిధ రకాల ధ్రువీకరణపత్రాలు, ఇతర ఉద్యోగాలకు అందించే క్లియరెన్స్‌ పత్రాలకు సంబంధిత శాఖల అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement