సింగరేణిలో మెడికల్‌ బోర్డు ఎత్తివేసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో మెడికల్‌ బోర్డు ఎత్తివేసే కుట్ర

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

గోదావరిఖని: సింగరేణిలో మెడికల్‌ బోర్డు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రెస్‌క్లబ్‌ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో కార్మికుల సంఖ్య ఎక్కువైందని, దీనిపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని చూస్తుంటే మెడికల్‌ బోర్డ్‌ను ఎత్తివేసే కు ట్ర జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. భట్టి వ్యాఖ్యలను టీబీజీకేఎస్‌ వ్యతిరేకిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గిస్తూ వచ్చాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారుణ్య నియామకాల పేరిట సింగరేణిలో దాదాపు 20 వేల ఉద్యోగాలను కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడికల్‌ బోర్డును ఎత్తివేయాలని చూస్తోందని, అదేజరిగితే టీబీజీకేఎస్‌ ఉద్యమాలు ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కహామీ కూడా నెరవేర్చలేక పోయాయని విమర్శించారు. వాటికి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా ఉండే అర్హత లేదన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు నూనె కొమురయ్య, గోపు ఐలయ్యయాదవ్‌, వడ్డేపల్లి శంకర్‌, మల్లేశం, మదాసు రామ్మూర్తి, చెలుకలపల్లి శ్రీనివాస్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement