మద్యంపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

మద్యంపై పోరుబాట

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

కోనరావుపేట(వేములవాడ): పల్లెల్లో మద్యం మహమ్మారిని పారదోలేందుకు ప్రజలంతా ఒక్కటవుతున్నారు. మద్యం పెడుతున్న చిచ్చును ఆర్పేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నారు. మద్య నిషేధం అమలు చేయాలంటూ తీర్మానాలు చేస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట, గోవిందరావుపేట, నిజామాబాద్‌ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించరాదని తీర్మానించారు. గ్రామంలో మద్యం అమ్మినా, కొనుగోలు చేసినా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఒకప్పుడు ఎర్రజెండా భావాలతో చైతన్యానికి మారుపేరుగా నిలిచిన కోనరావుపేట మండలం ఇప్పుడు మద్య నిషేధం అమలు చేస్తూ అవే పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

బెల్ట్‌షాపులతో అనర్థాలు

గ్రామాల్లో కొన్నేళ్లుగా బెల్ట్‌ దుకాణాలు కొనసాగుతున్నాయి. హమాలీలు, వ్యవసాయ కూలీలు పొద్దంతా కష్టపడి సంపాదించిన డబ్బును రాత్రయితే తాగుడుకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పలు కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. మద్యంబాబులు అనారోగ్యం పాలవుతున్నారు.

కదిలిన మహిళా లోకం

కుటుంబ పెద్ద మద్యానికి బానిసైతే.. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. దీంతో మహిళలు తాము అనుభవిస్తున్న మానసిక క్షోభను దూరం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలు నిషేధానికి గ్రామస్తులను ఒప్పించాలని మహిళా సంఘాల్లో నిర్ణయించుకున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఆయా గ్రామాల సర్పంచులను కలిసి తమ సమస్యను వివరించారు. సర్పంచులు సైతం మద్దతు తెలపడంతో గ్రామంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాలు సమావేశమై మద్యనిషేధానికి పూనుకున్నాయి. పంచాయతీ సాక్షిగా తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరుపనివ్వబోమంటూ ప్రమాణం చేశారు.

జిల్లాలోనే ఆదర్శం

గ్రామాల్లో మద్యం దుకాణాలను రద్దు చేస్తూ మల్క పేట, నిజామాబాద్‌, గోవిందరావుపేట గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం జిల్లాలోనే ఆదర్శమైంది. గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించినా రూ.50వేలు జరిమానా, పట్టించిన వారికి నజరానా అందించాలని తీర్మానించాయి.

పల్లెల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం

కోనరావుపేట మండలంలో మూడు గ్రామాలలో అమలు

మరికొన్ని గ్రామాలు అదే బాటలో..

హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement