చందుర్తి(వేములవాడ): భార్య పిల్లలతో కలిసి వేములవాడకు వెళ్తుండగా సమీపంలో బైక్‌లో పెట్రోల్ లేక ఆగిపోయిందన్న మాయమాటలు చెప్పి ఏడు నెలల క్రితం ద్విచక్రవాహనం చోరీ చేసిన కేసును బుధవారం చందుర్తి పోలీసులు చేధించారు. చందుర్తి ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మల్యాలకు చెందిన పీసరి నాగరాజు వద్దకు 2025 సెప్టెంబర్ 19న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తమ మోటార్ సైకిల్‌లో పెట్రోల్ లేక ఆగిపోయిందని, బైక్‌పై తమ భార్య, చిన్న పిల్లలున్నారని, మీ బైక్ ఇస్తే పెట్రోల్ తెచ్చుకుంటానని చెప్పి బైక్‌ను తీసుకెళ్లాడు. ఇదే అదునుగా భావించి మోటారు సైకిల్‌తో పారిపోవడంతో బాధితుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం తండాకు చెందిన కృష్ణ రాథోడ్ ఊరఫ్ భూక్యా కృష్ణ రాథోడ్‌గా గుర్తించి ఎత్తు కెళ్లిన మోటారు సైకిల్‌ను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను సీజ్ చేసి దొంగతనానికి పాల్పడిన కృష్ణ రాథోడ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రమేశ్ వివరించారు.
గొర్రెలు, కోళ్ల దొంగల..
సుల్తానాబాద్‌రూరల్: జల్సాలకు అలవాటుపడి గొర్రెలు, కోళ్లను చోరీ చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వివరాలను ఎస్సై వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన నలుగురు సిరిపురం రాకేశ్, నూనే అభిలాష్, గరిగంటి రాజ్‌కుమార్‌తోపాటు ఓ మైనర్ గతనెల 31న సుద్దాల గ్రామంలో ఒజ్జ రాములుకు చెందిన 5 గొర్రెలు, ఈనెల 6న చిన్నబొంకూర్ గ్రామంలో కల్వల లక్ష్మారెడ్డితోపాటు మరో ముగ్గురు రైతులకు సంబంధించిన దాదాపు 20 కోళ్లను దొంగతనం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు దొరికారన్నారు. వారిని అరెస్టు చేయడంతోపాటు దొంగతనానికి ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
యువతిని వేధించిన వ్యక్తి..
సిరిసిల్ల క్రైం: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వేధించిన సింగారపు గణేశ్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సిరిసిల్లకు చెందిన యువతిని రుద్రంగి మండలానికి చెందిన గణేశ్ పరిచయం చేసుకొని ప్రేమిస్తున్నాని చెప్పి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి వేధిస్తున్నట్లు బాధితురాలు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. అమ్మాయిలను వేధించడం, ప్రేమ పేరుతో వెంటపడడం, సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


