మీర్జంపేటలో తల్లీకూతుళ్ల అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

మీర్జంపేటలో తల్లీకూతుళ్ల అదృశ్యం

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

కాల్వశ్రీరాంపూర్‌: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు రామిడి లక్ష్మి(48), శ్వేత(28) అదృశ్యమయ్యారు. ఈనెల 7వ తేదీన ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు ఎంతకీ తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు తమకు తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఆందోళనకు గురైన లక్ష్మి భర్త వెంకట్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంకటేశ్‌ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకున్నామన్నారు. అదృశ్యమైన వారు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కనిపించినట్లు సమాచారం ఉందని, కానిస్టేబుళ్లను బుధవారం హైదరాబాద్‌ పంపించామని తెలిపారు. పూర్తిసమాచారం తెలిస్తే.. ఎస్సై 87126 56512, సుల్తానాబాద్‌ సీఐ 87126 56510 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

వృద్ధుడి ఆత్మహత్య

మల్యాల: మండలంలోని గొల్లపల్లెకు చెందిన ఎల్కపల్లి రాయమల్లు(85) ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. రాయమల్లు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 7న రాత్రి తన ఇంట్లోనే ఎలుకల మందు తాగాడు. సమీప బంధువులు గమనించి ఆయన కుమారుడు గంగమల్లయ్యకు సమాచారం అందించారు. 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. గంగమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

బావిలో దూకి మహిళ..

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన బట్ల స్వరూప(34) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్వరూప మూడేళ్లుగా మానసికంగా బాధపడుతోంది. గతంలోనూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడింది. ఈ మేరకు మృతురాలి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పెద్దపల్లిరూరల్‌ ఎస్సై మల్లేశ్‌ తెలిపారు.

ఉరేసుకుని వివాహిత..

జమ్మికుంట: దంపతుల మధ్య గొడవతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జమ్మికుంట టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం బిహార్‌ రాష్ట్రం నల్లంద జిల్లా బద్రు బీహార్‌ గ్రామానికి చెందిన రాహుల్‌కుమార్‌కు పూజాకుమారితో 2018లో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం జమ్మికుంటలోని కోరపల్లి రోడ్డులో ఉన్న ఓ రైస్‌ మిల్లులో కూలీకి చేరారు. రెండు రోజుల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం భర్త పనికి వెళ్లిన తరువాత పూజాకుమారి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాహుల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ తెలిపారు.

మద్యానికి బానిసై వ్యక్తి..

శంకరపట్నం: మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన ఇజ్జిగిరి ఐలయ్య (50) మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపా రు. ఐలయ్య మద్యం మానలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐలయ్య కుమారుడు విజయ్‌కుమార్‌ బుధవారం ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement