
‘పత్తిపాక’కు అడుగులు
● డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు ● 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ● 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి ● చివరి ఆయకట్టు రైతులకు తప్పనున్న సాగునీటి కష్టాలు
సాక్షి పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కోసం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడినుంచి నేరుగా కాకతీయ కాలువలోకి పంపిస్తారు. రేవెల్లి సమీప హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఎస్సారెస్సీ డీ–83, డీ–86 కాలవలకు అందిస్తారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, థర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లోని 2.40 లక్షల ఎకరా ల ఎస్సారెస్సీ ఆయ కట్టు స్థిరీకరణతో పాటు, కొత్తగా సుమారు 10 వేల ఎకరాలకు సాగు నీరు సమృద్ధిగా అందించే వీలుందని అధికారులు చెబుతున్నారు.
గతంలో ప్రతిపాదనలకే పరిమితం
ఎస్సారెస్సీ ద్వారా జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. వారబందీ పద్థతిలో నీటిని విడుదల చేస్తుండడంతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు అందించి స్థిరీకరించేందుకు ధర్మారం మండలం పత్తిపాక వద్ద 1.56 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, 7 టీఎంసీల సామర్థ్యంతో మరో ప్రతిపాదనను నీటిపారుదల అధికారులు రూపొందించినా అక్కడికే పరిమితమయ్యాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ కాలువకు మధ్య 3 కి.మీ. వరకు కెనాల్ నిర్మించారు. దీంతో గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాలువ ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలించినప్పుడు మాత్రమే లింక్‌కాలువ ద్వారా సాగునీరు అందతుంది. రైతులకు శాశ్వత పరిష్కారం లభించాలంటే పత్తిపాక రిజర్వాయర్ ని ర్మాణం తప్పనిసరిగా మారింది. దీంతో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారు. ప్రస్తుతం డీపీఆర్ తయారీకి నిధులు మంజూరు కావడంతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు రైతుల సాగుకష్టాలు తొలగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాథమిక
అంచనాలు సిద్ధం..
ప్రతిపాదిత పత్తిపాక ప్రాజెక్టును అధికారులతో కలిసి మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ గతంలోనే పరిశీలించారు. సమీక్షలు సైతం నిర్వహించారు. రిజర్వాయర్ ఎంత సామర్థ్యంతో నిర్మించాలి, ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతాయి? ఇందు లో ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఎన్ని? తదితర అంశాలపై ఇప్పటికే నీటి పారుదల శాఖాధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే, 1,700 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాకు వచ్చారు. ఇందులో 400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉంటుంది.

‘పత్తిపాక’కు అడుగులు