
4 నెలలు.. 20 మిలియన్ టన్నులు
● సింగరేణిలో 97శాతం బొగ్గు ఉత్పత్తి ● అగ్రస్థానంలో ఆర్జీ–2 ఏరియా
గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణి పకడ్బందీగా ముందుకు సాగుతోంది. గత నాలుగు నెలల్లో 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, జూలై నాటికి 20.81 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, 20.18మిలియన్ టన్నులు నమోదు చేసి నిర్దేశిత లక్ష్య సాధనలో 97 శాతం నమోదు చేసింది. జూలైలో వర్షాలు దంచి కొట్టినా.. అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించే ఓసీపీల్లో రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టింది. ముందుగా ఏర్పాటు చేసుకున్న స్టాక్‌కోల్ నుంచి రైల్వే మార్గం ద్వారా వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు సరఫరా చేసింది. దీంతో ఉత్పత్తిలో లోటు పెద్దగా కనిపించడం లేదు. అయితే వర్షాలు అధికంగా కురవడంతో జూలైలో సంస్థవ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లో 87శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే నమోదు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
నంబర్ వన్‌గా ఆర్జీ–2 ఏరియా
గత నాలుగు నెలల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించి ఆర్జీ–2 ఏరియా అగ్రస్థానంలో నిలిచింది. 19.87లక్షల టన్నుల లక్ష్యానికి 26.57లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి 134 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదు చేసింది. అలాగే 108 శాతంతో మణుగూరు ఏరియా రెండోస్థానంలో, 103 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి కొత్తగూడెం మూడోస్థానంలో నిలిచింది. మిగతా ఎనిమిది ఏరియాలు నిర్దేశిత లక్ష్య సాధనకు వెనుకబడ్డాయి. కేవలం 20 శాతం బొగ్గు ఉత్పత్తితో ఏపీఏ ఏరియా చివరి స్థానంలో నిచిలింది.