
పేదల జీవితాల్లో మార్పు తెస్తాం
● మంత్రి శ్రీధర్‌బాబు
మంథని: నమ్మకంతో అధికారం కట్టబెట్టిన పేదలకు అండగా ఉండి వారిజీవితాల్లో మార్పు తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంథని, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. స్థానిక ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. మహిళాశక్తి సంబురాల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చినమాట ప్రకారం అర్హులకు కొత్త రే షన్‌కార్డులతోపాటు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. మహిళలు వ్యాపారంలో రాణించేందుకు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యం పెంచేందుకు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన వీ – హబ్ ఉప కేంద్రం ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి ద్వారా డెయిరీ, పౌల్ట్రీఫారమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. చివరి లబ్ధిదారు వరకూ ఇల్లు చేరేలా ఇందిరమ్మ ఇంటి పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లక్షల మొక్కలు నాటామని గత పాలకులు చెబుతున్నారని, ఇలాగైతే పచ్చని తెలంగాణగా ఆవిర్భవించాలని, ఇప్పుడా పరిస్థితి లేదని మంత్రి అన్నారు. వన మహోత్సవం పేరిట నాటే మొక్కలపై ట్రీ ఆడిట్ జరుగాలని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, 20 నెలల్లోనే ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధా న్యం కల్పిస్తోందన్నారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా జిల్లాలో 25వేల మందికిపైగా పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు. అనంతరం రామగిరి, మంథని, ముత్తారం, కమాన్‌పూర్ మండలాలకు చెందిన 2,389 స్వశక్తి మహిళా సంఘాలకు రూ.2.37 కోట్ల విలువైన వడ్డీ రాయితీ చెక్కులతోపాటు పలు పథకాలు, ప్రయోజనాలకు సంబంధించిన చెక్కులు, రుణాలు, ఆర్థికసాయాన్ని మంత్రి పంపిణీ చేశారు. అటవీ – మున్సిపల్ శాఖలు చేపట్టిన వనమహోత్సవంలో మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఆర్డీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు.