
నగరంలో స్ట్రీట్‌బోర్డులు
● తొలిసారి ఏర్పాటుకు బల్దియా శ్రీకారం ● తొలగనున్న చిరునామా సమస్యలు ● రూ.50 లక్షలతో టెండర్ల ఆహ్వానం ● తొలివిడతలో 380 బోర్డులకు ఆర్డర్ ● స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారీ
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో చిరునామా తెలుసుకోవడం అంతసులువేమీకాదు. ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లాలన్నా.. కొత్తవారు పలానా ప్రదేశానికి పోవాలన్నా ప్రయాసే.. ఇట్లాంటి ఈ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు రామగుండం బల్దియా అధికారులు తొలి సారి స్ట్రీట్ సైన్ బోర్డుల(వీధి సూచిక బోర్డు) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని మొత్తం 60 డివిజన్‌లలో కొత్తగా స్ట్రీట్‌సైన్ బోర్డులు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూందించారు. ఇటీవల నగరంలో 50 డివిజన్ల నుంచి 60 డివిజన్ల కు పెంచుతూ పునర్విభజన చేసిన విషయం విదిత మే. ఈనేపథ్యంలో కొత్త ప్రాంతాలు, ప్రదేశాలు, కూడళ్లను తెలుసుకోవడం కష్టతరంగా మారింది. డివిజన్ల వారీగా ప్రజలు సులభంగా చిరునామా తెలుసుకునేలా స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్‌తో స్ట్రీట్‌సైన్ బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారు.
రూ.50లక్షలతో టెండర్..
రామగుండం నగరంలో స్ట్రీట్‌సైన్ బోర్డుల ఏర్పాటుకు 20 రోజుల క్రితం రూ.50లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచిన అధికారులు.. ఓ కాంట్రాక్టర్‌కు పనులు కూడా అప్పగించారు. తొలివిడతలో మొత్తం 380 స్ట్రీట్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని హైదరాబాద్‌లో తయారు చేయిస్తున్నారు.
తొలగనున్న సమస్యలు..
రామగుండం బల్దియాలోని 60 డివిజన్లలో తొలిసారి ఏర్పాటు చేయనున్న స్ట్రీట్‌సైన్ బోర్డులతో కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాలు, దిశలను తెలుసుకోవడం అందరికీ సులభతరం కానుంది. వేములవాడ మున్సిపాలిటీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన రెండు రకాల స్ట్రీట్‌సైన్ బోర్డుల తరహాలోనే రామగుండంలోనూ ఏర్పాటు చేయడానికి డిజైన్లను ఎంపిక చేశారు. ఈస్ట్రీట్‌సైన్ బోర్డులతో ఏ డివిజన్ ఎక్కడుంటుంది? ఆ డివిజన్‌లో ఏ ప్రాంతం ఉందనే సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.
జంక్షన్లలో సైన్‌బోర్డులు..
ఒకటో డివిజన్ నుంచి 60వ డివిజన్ వరకు ఆయా డివిజన్ల పరిధిలోని వీధుల పేర్లు, కాలనీలు, ఇంటినంబర్లు, రోడ్డు నంబర్లు, కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలు.. తదితర వివరాలను ఇప్పటికే బిల్‌కలెక్టర్ల ద్వారా బల్దియా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభా గం అధికారులు సేకరించారు. ఒక్కోడివిజన్ లో ఎక్కడెక్కడ సైన్ బోర్డులు పెట్టాలి? వాటి పై డివిజన్ల నంబర్లు, కాలనీల పేర్లతోపాటు ఎటువైపు ఏ ప్రాంతం ఉంటుందో తెలుసుకునేలా సూచికలు పొందుపర్చడానికి నివేదికలను సైతం తయారు చేసినట్లు తెలిసింది. దీనిఆధారంగా స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్‌తో స్ట్రీట్‌సైన్ బోర్డులను సిద్ధం చేస్తున్నారు.
చిరునామా తెలుసుకోవడం సులభం
కొత్తగా 60 డివిజన్లుగా ఏర్పడిన రామగుండం నగరంలో ప్రజలకు అడ్రస్ తెలుసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో స్ట్రీట్ సైన్‌బోర్డులను ఏర్పాటు చేయిస్తున్నాం. కూడళ్లు, రోడ్లు, ముఖ్యమైన ప్రాంతాలు, ఇంటి నంబ ర్లను సైన్‌బోర్డులపై పొందుపరుస్తాం. 15రోజుల్లో సైన్‌బోర్డుల తయారీ పనులు పూర్తవుతాయి. వాటి ఏర్పాటులో సమస్యలు తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – అరుణశ్రీ, బల్దియా కమిషనర్, రామగుండం

నగరంలో స్ట్రీట్‌బోర్డులు