
‘గృహజ్యోతి’కి ఎడిట్ కష్టాలు
● ఆన్‌లైన్‌లో తప్పిదాలు ● యథేచ్ఛగా కరెంట్ బిల్లులు ● అయోమయంలో లబ్ధిదారులు
రామగిరి(రామగుండం): ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం(జీరో కరెంట్ బిల్) కొందరు అర్హులకు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసే సమయంలో చోటుచేసుకున్న పొరపాట్లతో ఈ సమస్య తలెత్తింది. మరికొందరు వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజల నుంచి అధికారులు స్వీకరించిన దరఖాస్తులను ప్రజాపాలన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇలా నమోదు చేసే ప్రక్రియలో మీటర్ నంబర్లు తప్పు గా వేయడం, పథకానికి దరఖాస్తు చేసుకోలేదు(నాట్ ఆప్‌లైడ్) అని నమోదు చేయడంతో అర్హులైన పేదలు ఈ పథకానికి దూరమవుతున్నారు.
చేతులెత్తేస్తున్న అధికారులు
దరఖాస్తుదారులు మండల ప్రజాపరిషత్ కా ర్యాలయాలకు వెళ్లి ఎంపీడీవోల దృష్టికి సమస్య తీసుకెళ్లగా తమ చేతిలో ఏమీలేదంటున్నారు. ప్రజాపాలన ఆన్‌లైన్ పోర్టల్‌లో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని వారు చెబుతున్నారు. కొత్తగా కరెంట్ మీటర్ తీసుకున్న పేదలకు కూడా ఈ పథకం వర్తించడం లేదు.
అమలుకు నోచుకోని హామీ
దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అది క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అర్హులైన పేదలు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారడం తప్ప పరిష్కారం లభించడం లేదు. అధికారులు స్పందించి ప్రజాపాలన పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే అర్హులైన పేదలకు ప్రభుత్వం అందించే పథకం వర్తిస్తుందని లబ్దిదారులు కొరుతున్నారు.