
యువతలోనే నిర్లక్ష్యం
● సింగరేణిలో పెరుగుతున్న గైర్హాజరు ● భూగర్బ గనుల్లో చేసేందుకు విముఖత ● ఏడాదిలో వందమస్టర్లు చేయని ఉద్యోగులపై యాజమాన్యం దృష్టి ● కుటుంబ సభ్యులకు అధికారుల కౌన్సెలింగ్
గోదావరిఖని: ఉద్యోగుల గైర్హాజర్‌పై సింగరేణి సీరియస్‌గా ఉంది. ఉద్యోగం లభించడమే కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో విధులకు గైర్హాజర్ అవుతూ కొందరు ఉన్న ఉద్యోగానికి ఎసరుతెచ్చుకుంటున్నారు. ఇటీవల మహిళా ఉద్యోగులు కూడా భూగర్భగనుల్లోకి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, కొందరు యువ ఉద్యోగులు విధులకు గైర్హాజర్ కావడం ఆందోళన కలిగిస్తోంది.
పెరిగిన యువత..
సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. గైర్హాజర్ కూడా అదే స్థాయిలో నమోదు అవుతోంది. యువతతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి సంస్థ మరింత వృద్ధి చెందుతుందని యాజమాన్యం భావించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. గతేడాది వంద మస్టర్లు నిండని, ఈఏడాది జూన్ వరకు 50 మస్టర్లు పూర్తిచేయని ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
కారుణ్య నియామకాలతో..
కారుణ్య నియామకాలతో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. మెడికల్ ఇన్వాలిడియేషన్ ద్వారా రైటర్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగలు వస్తున్నాయి. ఈక్రమంలో వీరి సంఖ్య ఇప్పటివరకు 16 వేలకుపైగా చేరింది. పాత తరం కార్మికులు బాగానే పనిచేస్తున్నా.. యువతఆశించిన మేరకు విధులకు హాజరు కావడం లేదని అధికారులు అంటున్నారు. ఉన్నత చదువులు చదివి భూ గర్భగనుల్లో పనిచేసేందు కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఏసీల కింద కూర్చుని అత్యధిక ప్యాకేజీలతో ఉల్లాసంగా బతికిన యువత.. బొగ్గు గనుల్లో పనులు చేసేందుకు ఉక్కి రిబిక్కిరవుతున్నారని అంటున్నారు. కష్టమైన పనులకు పురమాయిస్తే గైర్హాజరవుతున్నారు.
పర్మినెంట్ పోస్టులకు ఎసరు..
సింగరేణిలో పర్మినెంట్ పోస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. భూగర్భగనుల్లో సపోర్టింగ్, రూఫ్‌బోల్టింగ్, గనులపై క్యాంటీన్లలో పనిచేసే ఉద్యోగులు, కొన్నిచోట్ల క్యాంటీన్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. పర్మినెంట్ కార్మికులు ఈ పనులు చేసేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వేగంగా సాగుతోంది. కన్వేయన్స్ వాహనాలు, ఓబీ వెలికితీత, సివిల్, సివిక్ విభాగాల్లో ప్రైవేటీకరణ ఊపందుకుంది.
మూడేళ్లలో వందలోపు మస్లర్లుంటే డిస్మిస్
గైర్హాజర్ కార్మికుల గురించి సింగరేణి మానవీ య కోణంలోనే వ్యవహరిస్తోంది. డ్యూటీలు తక్కువగా చేసే కార్మికుల కోసం ఏరియాల వారీగా కౌన్సెలింగ్ ఇస్తోంది. కుటుంబ సభ్యులతో సహా కౌన్సెలింగ్ ఇచ్చి.. సంతృప్తికరమైన సమాధానాలు చెప్పిన వారికి కొన్ని సడలింపులు ఇస్తోంది. అయితే, చాలామంది చిన్న కారణాలతోనే విధులకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఏరియా గైర్హాజర్
ఆర్జీ–1 118
ఆర్జీ–2 66
ఆర్జీ–3 14
ఏపీఏ 67

యువతలోనే నిర్లక్ష్యం