పార్వతీపురం రూరల్: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం ‘పల్లె నిద్ర’కు శ్రీకారం చుట్టింది. ‘మన్యంతో మమేకం– మీతో మేము.. మీరే మేము’ అన్న స్ఫూర్తిదాయక నినాదంతో నర్సిపురం ఎంపీపీ పాఠశాలలో సోమవారం రాత్రి ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రక్షకభటులపై ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పుతూ, గ్రామాల్లో తలెత్తే చిరువివాదాలు శాంతిభద్రతలకు విఘాతంగా మారకముందే పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమం ఓ వారధిలా నిలుస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. యువత పెడదారిన పడొద్దని, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలకు ఆమడదూరంలో ఉంటూ సముజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా భద్రత, సైబర్ నేరాలు, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ‘ఇంటింటికీ.. మన్యం పోలీస్’ పేరిట గడపగడపకూ వెళ్లి కరపత్రాలు పంచి, ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ఈ మేరకు స్థానిక సచివాలయంలో ఎస్పీ రాత్రి బస చేశారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా అధికారులు పల్లెబాట పట్టి, గ్రామాల్లోనే రాత్రి బస చేస్తూ ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ పి.రంగనాథం, ఎస్సై రాజేష్, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


