విజయనగరం అర్బన్: జాతీయ భూగర్భ శాస్త్రవేత్తల దినోత్సవాన్ని స్థానిక ఎంఆర్ కశాళాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అస్సాం రాష్ట్ర ఓఎన్‌జీసీ సూపరింటిండెంట్ జియాలజిస్ట్ సంతోష్ యలమంచి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో జియాలజిస్టుల ప్రాధాన్యం వెలకట్టలేనిదన్నారు. ముఖ్యంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ వంటి సహజ వనరుల అన్వేషణలో వారి పాత్ర ఎంతో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భూగర్భ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టేకు శంకరరావు, అధ్యాపకులు డాక్టర్ పి.గణపతి, కె.సత్యనారాయణనాయుడు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


