● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం గంటస్తంభం: తమ శాఖకు సంబంధం లేదని చెబుతూ పీజీఆర్‌ఎస్ వచ్చే అర్జీలను తిరస్కరించకుండా.. సంబంధిత శాఖకు పంపించి పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్జీదారుడికి సంతృప్తికరమైన పరిష్కారం అందించడమే లక్ష్యంగా, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అర్జీల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికపరమైన అంశాలపై వచ్చిన అర్జీలను కూడా నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, ఏ అర్జి కూడా ఎస్‌ఎల్‌ఏ గడువు దాటి పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు.
ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్‌పై దృష్టి..
ప్రభుత్వ శాఖల సేవలపై ఐవీఆర్‌ఎస్ సర్వేలో ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించడంతో పాటు సేవల నాణ్యతను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ ఎం.అరుణ, ఎస్‌డీసీ ఈ.మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.


