అనాథ చిన్నారులకు అందని ‘తల్లికి వందనం’ | - | Sakshi
Sakshi News home page

అనాథ చిన్నారులకు అందని ‘తల్లికి వందనం’

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

అనాథ చిన్నారులకు అందని ‘తల్లికి వందనం’

జియ్యమ్మవలసరూరల్‌: ఆ చిన్నారుల ఆవేదన ఎవరికి పడుతుంది. వారి మొర ఎవరు ఆలకిస్తారు. ఏ అధికారి వారిని పట్టించుకుంటాడు. తల్లిదండ్రులను కోల్పోయిన తరువాత అనాథలుగా మిగిలిన ముగ్గురు ఆడపిల్లలకు అందాల్సిన తల్లికి వందనం పథకం వారికి నేటికీ అందలేదు. ఈ కథనం వివరాలిలా ఉన్నాయి. జియ్యమ్మవలస మండలంలోని అర్నాడ పంచాయతీ వనజ గ్రామానికి చెందిన మీనక మధుసూదనరావు, సత్యవతి దంపతులతో పాటు వారి కుమారుడు ఈ ఏడాది జనవరి 23న ఇంటిలో కుంపటి పొగతో ఊపిరాడక మృతిచెందారు. దీంతో ఆ దంపతుల మరో ముగ్గురు కుమార్తెలు మాధురి, మోక్ష, ఐసులు అనాథలుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోలేదు సరికదా కనీసం తల్లికి వందనం కూడా ఆ ముగ్గురికీ రాలేదని వారి నాయనమ్మ మీనక సోములమ్మ వాపోతోంది. రూ.13వేలు చొప్పున ముగ్గురు పిల్లలకు మొత్తం రూ. 45వేలు రావాల్సి ఉండగా ఏ ఒక్కరికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు. పిల్లల తల్లిదండ్రులకు ఏయే బ్యాంకు ఖాతాలు ఉన్నాయో వాటన్నింటినీ తనిఖీ చేశారు. అయినప్పటికీ ఏ ఒక్క ఖాతాలోనూ అమౌంట్‌ పడలేదు. దీంతో సచివాలయం, మండల కేంద్రంలో సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నా మృతిచెందిన తల్లి, తండ్రి బ్యాంకు ఖాతాల్లో పడి ఉంటాయేమో చూడండని చెబుతున్నారే తప్పితే సరైన పరిష్కారం చూపడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఈ చిన్నారులను స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవాలని వృద్ధురాలైన వారి నాయనమ్మ వేడుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement