పాలకొండ మండలం టీడీ పారాపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నిర్మితమైంది. ప్రస్తుతం ఇక్కడ 25 మంది వరకూ విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాలం చెల్లిన భవనాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. తరగతి గదుల పై కప్పు నుంచి ఎప్పటికప్పుడు పెచ్చులు కింద పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న గదుల్లో ఒకదానిని పూర్తిగా వినియోగానికి దూరం ఉంచారు. పాలకొండ నియోజకవర్గంలో 356 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద రూ.కోట్లాది నిధులు వెచ్చించి దాదాపు 205 పాఠశాలలు అభివృద్ధి చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నాడు–నేడు మనబడి కార్యక్రమం కనుమరుగయ్యింది. అప్పట్లో మంజూరైన తరగతి గదులు, అదనపు భవనాల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసింది. ఈ ప్రభావంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. గత జగన్ మోహన్ రెడ్డి పాలనలో పిల్లలకు చదువులే ఆస్తిగా భావించారు. నియోజకవర్గంలో రెండు వందలకు పైబడి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసి చూపించారు. నేడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. బడిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడేలా సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులు కల్పించాలి.
– విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ.


