మమ్మలను.. టార్గెట్‌ చేశారు! | - | Sakshi
Sakshi News home page

మమ్మలను.. టార్గెట్‌ చేశారు!

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

మమ్మలను.. టార్గెట్‌ చేశారు!

ఏ పని చేయాలన్నా..

సచివాలయ ఉద్యోగికే..!

చిత్రంలో ఉన్న వారంతా పార్వతీపురం అర్బన్‌ పరిధిలోని వార్డు (స్వర్ణ) సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. సర్‌ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓల బాధ్యతలు కూడా వీరికి అప్పగించారు. ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా అత్యంత ప్రాధాన్యంతో ఈ బాధ్యతలు నిర్వర్తించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒక వైపు ఈ పనులు చేస్తూనే.. యోగాంధ్ర, స్వచ్ఛ సర్వేక్షణ్‌, ఆస్తి పన్ను వసూలు, పిల్లల డ్రాప్‌ అవుట్లను గుర్తించడం, యూఎఫ్‌ఎస్‌ ధ్రువీకరణ, తల్లికి వందనం లబ్ధిదారుల గుర్తింపు, పలు సర్వేలు చేస్తున్నారు. దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమకు అదనపు పని భారాన్ని తగ్గించాలని, లేకుంటే సర్‌ కార్యక్రమం నుంచి మినహాయింపైనా ఇవ్వాలని శుక్రవారం ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌ హేమలతను కలిసి వినతిపత్రం అందించారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకు చేరవేస్తున్న సచివాలయ (స్వర్ణ గ్రామ/వార్డు) ఉద్యోగుల సేవల వెనుక కనిపించని కష్టాలు, త్యాగాలు, ఆందోళనలు దాగి ఉన్నాయి. ఎండలు, వానలు లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న వీరు.. ప్రతి రోజూ ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఉదయం విధులకు వెళ్లిన ఉద్యోగి.. సాయంత్రం క్షేమంగా ఇంటికి చేరుతాడో లేదో తెలియని పరిస్థితి అనేక కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, వార్డులు, వీధులు తిరుగుతూ ఇంటింటి సర్వేలు, లబ్ధిదారుల వివరాల సేకరణ, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. లక్ష్యాలు, గడువులు, నివేదికల ఒత్తిళ్ల మధ్య నిరంతరం ప్రజల మధ్యే పనిచేస్తున్నారు.

బాధ్యతలకు అంతం లేదా?

ప్రజలకు ప్రభుత్వ సేవలను గడప గడపకు చేర్చే సచివాలయ ఉద్యోగులపై రోజురోజుకూ పని భారం పెరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలు, క్షేత్రస్థాయి తనిఖీలు, సంక్షేమ పథకాల అమలు, యాప్‌ల్లో సమాచారం నమోదు, నివేదికల సమర్పణ, ప్రత్యేక విధులు.. ఇలా అనేక బాధ్యతల మధ్య ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆదివారం కూడా వారికి సెలవులు ఉండడం లేదు. ఇటీవల యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల టార్గెట్లు ఇచ్చారు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఉద్యోగులకు లక్ష్యం విధించారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదయం మొదలైన విధులు రాత్రి వరకు కొనసాగడం, సెలవు దినాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి రావడం, తరచూ మారుతున్న ఆదేశాలు ఉద్యోగులపై అదనపు భారం మోపుతున్నాయని వాపోతున్నారు. విధులకు సంబంధించిన లక్ష్యాలు, గడువులు, ఉన్నతాధికారుల సమీక్షల మధ్య మానసిక ప్రశాంతత కోల్పోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పని ఒత్తిడిని తట్టుకోలేక సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలపై గ్రామాలు, వార్డులు తిరుగుతూ ప్రమాదాలకు గురయ్యే ఘటనలు పెరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పని భారం, ప్రయాణ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల మధ్య సచివాలయ సిబ్బంది జీవితం సవాళ్లతో సాగుతోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి తగ్గించడంతో పాటు, వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

జిల్లాలోని 350 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వివిధ విభాగాల్లో 3,200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ధ్రువీకరణ పత్రం అందించడం నుంచి పింఛన్‌ మంజూరు వరకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదం సంభవిస్తే ఆస్పత్రి ఖర్చులు, కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు వంటి సమస్యలు వారి కుటుంబాలను వెంటాడుతున్నాయి. ‘ప్రజలకు సేవ చేయడం మా బాధ్యతే. కానీ మా భద్రత, మా కుటుంబాలకు భరోసా కూడా అంతే ముఖ్యం’ అని ఉద్యోగులు చెబుతున్నారు.

సచివాలయ ఉద్యోగుల్లో ‘కనిపించని కన్నీళ్లు’!

ఇంటింటికీ సేవ.. గుండెల్లో గుబులు!

లక్ష్యాలు, ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది

ఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement