విజయనగరం టౌన్: స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఏర్పాట్లలో వివక్ష చూపడం తగదని జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, రొంగలి రామారావు, ఇప్పిలి రామారావు, బూర ఐశ్వర్య, టీవీ.దుర్గారావు, దిమిలి పైడిరాజు, షాజహాన్‌లు పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రజా గ్రంథాలయంలో ఆదివారం లచ్చన్న చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తన జీవితాంతం కార్మికులు, కర్షకుల, పేద, దళితుల పక్షాన నిలబడి ఆనాటి వ్యవస్ధలకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసిన మహాయోధుడని కొనియాడారు. అటువంటి మహానీయుడి విగ్రహాన్ని జిల్లాలో ఏర్పాటుచేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆ యన జయంతిని రాష్ట్ర పండగగా గుర్తించిన ప్రభుత్వం విగ్రహం ఏర్పాటులో నిర్లక్ష్యదోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో చెలికి లక్ష్మణరావు, జంపాన చిన్న, తదితరులు పాల్గొన్నారు.


