బాధ్యత లేదు... ప్రజలంటే లెక్కలేదు.. | - | Sakshi
Sakshi News home page

బాధ్యత లేదు... ప్రజలంటే లెక్కలేదు..

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

బాధ్యత లేదు... ప్రజలంటే లెక్కలేదు.. గతంలో రైతులకు గిట్టుబాటు ధర

రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంట సీజన్‌కు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. ఆర్‌బీకే సిబ్బందితో మద్దతు ధరకు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు సాగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొక్కజొన్న పంట రైతు చేతికందినా కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. పంటను నిల్వచేయలేక దళారులకు తక్కువ ధరకే విక్రయించి రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.

– పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్సీ

విజయనగరం రూరల్‌: జిల్లాలో ఎటుచూసినా సమస్యలే... వేసవిలో పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి... మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు... దళారుల పాలవుతున్న మొక్కజొన్న పంట... కొత్త పింఛన్లు, ఇళ్లు మంజూరుకాక లబ్ధిదారుల్లో ఆందోళన.. సున్నావడ్డీ మంజూరుకాక డ్వాక్రా మహిళల్లో నిరాశ.. సంక్షేమ పథకాలు అందక అన్నివర్గాల ప్రజల్లో ఆవేదన.. ఇలా.. ఎటుచూసిన సమస్యలే కనిపిస్తున్నాయి. ఇవేవీ అధికార పార్టీ నేతలకు పట్టడం లేదు.. వీటిపై చర్చించి పరిష్కరించేందుకు అనువైన జెడ్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు ఒక్కరూ హాజరుకాలేదు.. ఇలాంటి వాళ్లు కాబట్టే వీరందరనీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మరీ చీవాట్లు పెట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టుకుని ఏం చర్చిస్తాం... ప్రజలకు ఏం సమాధానం చెబుతాం... అంటూ జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ కార్యాలయంలో గురువారం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించగా కొనుగోలు కేంద్రాలు లేక, ప్రభుత్వ మద్ధతు ధర లభించక మొక్కజొన్న రైతులు తమపంటను దళారులకు తక్కువ ధరకే విక్రయించి, నష్టాల పాలవుతున్నారని సభ్యులు సభలో ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర లభించక రైతులు టన్నుకు సుమారు రూ.23 వేల వరకు నష్టపోతున్నారని తెలిపారు.

వేతనదారులకు కనీస వేతనం అందాలి

ఉపాధిహామీ చట్టం మార్పుపై క్షేత్రస్థాయిలో అపోహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జడ్పీ చైర్మన్‌ అధికారులకు సూచించారు. వేతనదారులకు నిర్దేశించిన పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ విజయనగరం మండలంలో 2025–2026 సంవత్సరానికి సంబంధించి రూ.2.50 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ లోతుగా చేపట్టాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. సామాజిక తనిఖీల్లో భాగంగా గుర్తించిన రూ.45 లక్షలు అవకతవకలు రికవరీ ఏమైందని అధికారులను ప్రశ్నించారు. విజయనగరం ఎంపీడీవో గంటా వెంకటరావు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, మండల పాలకవర్గం చేసిన తీర్మానాలను బుట్టదాఖలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పావలా వడ్డీ పథకం అటకెక్కించారు

డీఆర్‌డీఏ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు ప్రగతిని వివరించగా, పావలా వడ్డీ పథకం మహిళలకు అందుతుందా అని జెడ్పీ చైర్మన్‌ అధికారులను అడిగారు. అటువంటి పథకం ఏదీ అమలు కావడం లేదని, మహిళా సభ్యులే తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పావలా వడ్డీ పథకాన్ని అటకెక్కించారని సభ్యులు మండిపడ్డారు.

జెడ్పీ సర్వసభ్య సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం

మొక్కజొన్నకు మద్ధతు ధర లేక దళారుల వలలో రైతులు

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలి

రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేయని ప్రభుత్వం

డ్వాక్రా మహిళలకు అందని పావలా వడ్డీ రాయితీ

కూటమి ప్రభుత్వంలో మంజూరుకాని ఇళ్లు

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల నిలదీత

చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని సభ్యులు తెలపగా, అధికారులు అది నిజమేనని తెలుపుతూ, కొత్త పింఛన్లు మంజూరుకు వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు. పింఛన్ల పంపిణీలో కొంతమంది సిబ్బంది రాజకీయ కారణాలతో లబ్ధిదారులకు పింఛన్లు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనికి సంబంధించి తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని జెడ్పీ చైర్మన్‌ అధికారులను నిలదీశారు. నెలకు సుమారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 వేలకు పైగా పింఛన్లు రీబాక్‌ అవుతుండడం విచారకరమన్నారు. ఉద్దేశపూర్వకంగా పింఛన్లు అందించని సిబ్బందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని జేసీని కోరారు. రాష్ట్ర తూర్పుకాపు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.యశస్వి పలు అంశాలను సభ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జెడ్పీ చైర్మన్‌ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గతంలో చేపట్టిన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా వాటి వివరాలు అందిస్తే జెడ్పీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement