రాత్రికి రాత్రే శిలాఫలకం మాయం.. | - | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే శిలాఫలకం మాయం..

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

రాత్రికి రాత్రే శిలాఫలకం మాయం..

పార్వతీపురం నియోజకవర్గం అడ్డాపుశీల పంచాయతీ పిన్నింటి రామినాయుడువలసలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌ గురువారం ఆవిష్కరించేందుకు వచ్చారు. ఆయనతోపాటు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఇతర టీడీపీ నాయకులు ఉన్నారు. గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక కార్యకర్త సింగిరెడ్డి జయపాల్‌.. సొంత స్థలంలో, వ్యక్తిగత నిధులు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఆయన ప్రారంభోత్సవానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్రను కూడా ఆహ్వానించారు. ఆయన సమాధానం బాగోలేకపోవడంతో ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును ఆహ్వానించారు. గురువారం ఉదయం పండగ వాతావరణంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ముందురోజు బుధవారం రాత్రి విగ్రహ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. అక్కడితో ఆగకుండా విగ్రహదాత జయపాల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి జయపాల్‌ తప్పించుకుని పారిపోయాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడనున్నాయన్న సమాచారంతో పోలీసులు గురువారం ఉదయం భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈలోగా మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఇతర నాయకులు అక్కడికి చేరుకున్నారు. విగ్రహావిష్కరణ జరగనీయకుండా టీడీపీకి చెందిన మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారి సూచనల మేరకు విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే నాయకులు వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement