హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీస్‌

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కె.శ్రీనివాసరావుకు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వనున్నట్టు పాలకొండ సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ తెలిపారు. గురువారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముస్తాబు గది అందంగా తీర్చిదిద్దకపోవడం, వసతిగృహ గదులు పరిశుభ్రంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదులను సందర్శించి చదువులు పరిశీలించారు. బాగా చదువుకోవాలని సూచించారు. ఇప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కన్నవారి చెంతకు బాలుడు

విజయనగరం క్రైమ్‌: విజయనగరం కోట జంక్షన్‌ వద్ద ఆరేళ్ల బాలుడు నరేంద్ర నానిని క్రైమ్‌ పార్టీ పోలీసులు గుర్తించి గురువారం స్టేషన్‌కు తీసుకువచ్చారు. విజయనగరం కొనిసి వీధికి చెందిన కోదాడ రాము, ఈశ్వరిల బిడ్డ నాని ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. పిల్లాడి కోసం కన్నవారు వెతుకుతున్న క్రమంలో కోట జంక్షన్‌ వద్ద అయోమయంగా, భయపడుతూ బిత్రచూపులు చూస్తున్న నానిని స్థానికులు గుర్తించారు. వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో క్రైమ్‌ పార్టీ హెచ్‌సీ రమణ హుటాహుటిన కోట జంక్షన్‌ వద్దకు వెళ్లి పిల్లాడిని తీసుకుని స్టేషన్‌కు వచ్చారు. ఇదే విషయంపై స్థానికుల నుంచి సమాచారాన్ని అందుకున్న నాని కన్నవారు రాము, ఈశ్వరి వన్‌టౌన్‌ స్టేషన్‌కు రావడంతో ఆరేళ్ల బాలుడిని హెచ్‌సీ రమణ అప్పగించారు. పోలీసులకు నాని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

టేకు తోట దగ్ధం

గజపతినగరం రూరల్‌: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలోని టేకు తోటలో గురువారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రెండు ఎకరాల తోట దగ్ధమైంది. గ్రామంలోని బూర్ల నాయుడు, బూర్ల అప్పలనాయుడు, బూర్ల కృష్ణలకు చెందిన రెండెకరాల విస్తీర్ణంలోని టేకు తోటలో ఎవరో పొగ తాగిన సిగరెట్‌, బీడీ పడేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు నష్టం సంభవించినట్టు అంచనా వేశారు. అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

గ్యాస్‌ సిలిండర్ల సీజ్‌

పూసపాటిరేగ : మండలంలోని స్వీటు షాపులు, హోటల్‌లో అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 12 గ్యాస్‌ సిలిండర్లను సీజ్‌ చేసినట్టు విజిలెన్సు సీఐ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఆయా షాపులు, హోటల్‌లు యజమానులుపై 6 ఏ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దాడులలో సీఎస్‌డీటీ మురళితో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement