నెల్లిమర్ల రూరల్: జీవితాంతం తోడుగా ఉన్న భార్యను కోల్పోయిన తర్వాత ఆ జ్ఞాపకాల మదిలో జీవించిన ఓ వృద్ధుడి కథ చివరికి విషాదాంతంగా మారింది. మతిమరుపు బాధిస్తున్నా.. తన భార్య ఫోన్ నంబరు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంచుకున్న వృద్ధుడు చివరికి అదే జ్ఞాపకాల నడుమ తుది శ్వాస విడిచాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలోని కేఎల్ పురానికి చెందిన కె.సత్యనారాయణ(72) అనే వృద్ధుడు మతిమరుపుతో బాధపడుతుండేవాడు. గతంలో ఎప్పుడైనా దారి తప్పినా తనే వేరే వారితో తన భార్య ఫోన్ నంబరుకు ఫోన్ చేయించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకునేవాడు. అయితే నాలుగు నెలల క్రితం ఆయనకు జీవితాంతం తోడుగా నిలిచిన భార్య అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన సత్యనారాయణ ఇటీవల ఇల్లు వదిలి బయటకి వచ్చాడు. మతిమరుపుతో దారి తప్పినా తనకు గుర్తున్న అదే ఫోన్ నంబరుకు కాల్ చేసినా స్పందించే తోడు ఇక లేదని గ్రహించారో ఏమో..? చివరికి కొండవెలగాడ సమీపంలో ఓ లేఅవుట్ వద్ద తనువు చాలించాడు. ఎప్పుడు చనిపోయాడో.. ఏమోగానీ శరీరం మొత్తం పాడైపోయి అచేతనంగా పడి ఉన్నాడు. అటుగా వెళ్లిన కొంతమంది మృతదేహాన్ని బుధవారం గుర్తించి నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ గణేష్ ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు గురువారం మృతదేహాన్ని తమకి చెందిన వారిగా గుర్తించి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆకలితో నీరసించి వడదెబ్బకు గురై చనిపోయి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
నాలుగు నెలల కిందట భార్య మృతి
మతి మరుపు సమస్యతో తనువు
చాలించిన వృద్ధుడు
కొండవెలగాడ సమీపంలో అచేతనంగా మృతదేహం


