చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలం కొండపాలేంలో గల హడ్కో కాలనీ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో ఏడు మేకలు మృతి చెందాయి. మరికొన్ని మేకలు తప్పించుకుని పారిపోవటంతో బతికి బయటపడ్డాయి. అదే సమయంలో మేకల యజమాని కాని, ఇతరులు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఏది ఏమైనా మూగజీవాలు విద్యుత్‌షాక్ గురై మృతి చెందాయి. కొండపాలేంలోని హడ్కో కాలనీ సమీపంలో గడపర్తి అసిన్నదొర అనే మేకల పెంపకందారుడు మేకలు, గొర్రెలు ఫారమ్‌ని నిర్వహిస్తున్నాడు. తన ఇంటి వెనుకవైపున ఈ ఫారమ్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఈ మేకల షెడ్డుపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. మేకల కోసం వేసిన షెడ్డుకు సంబంధించిన ఇనుప ఫెన్సింగుకు విద్యుత్ వైర్లు తాకడటంతో ఏడు మేకలతో పాటుగా కోళ్లు మృతి చెందాయి. ఇదే సమయంలో విద్యుత్ షాక్‌కు గురైన మేకల అరుపులకు భయపడిన మిగిలిన మేకలు అక్కడ నుంచి పారిపోవటంతో మిగిలిన మేకలు ప్రాణాలతో బయటపడ్డాయి. అదే షెడ్డులో సుమారుగా 40 మేకలు ఉన్నట్టు చెబుతున్నారు. ఎప్పుడూ మేకల షెడ్డులో ఉండే అసిన్నదొర ఆ సమయానికి షెడ్డులో లేకపోవటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తనకు జీవనోపాధిని కల్పిస్తున్న మేకలు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందటంతో ఆర్థికంగా నష్టపోయాయని బాధితుడు వాపోతున్నాడు. విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది, సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు నివేదికలు అందజేశారు.


