విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శాశ్వత ప్రజా న్యాయ పీఠంపై న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శాశ్వత ప్రజా న్యాయ పీఠం సేవలను అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ శాశ్వత ప్రజా న్యాయ పీఠం ఏఏ సేవలను అందిస్తుందో వారికి తెలిపారు. ఈ శాశ్వత న్యాయ పీఠంలో బీమా రంగానికి సంబంధించిన సేవలు, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సేవలు, విద్యా లేక విద్యాసంస్థలకు సంబంధించిన తగాదాలు, నివాసం, వాస్తవ ఆస్తికి సంబంధించిన సేవలు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన తగాదాలు, ప్రయాణికులు లేక వస్తువుల చేరవేసే రోడ్డు రవాణా, వాయు రవాణా, జల రవాణా సేవలు, పోస్టల్, టెలిఫోన్ టెలిగ్రాఫ్ సేవలు, విద్యుత్ సరఫరా, కాంతి సరఫరా, నీటి సరఫరా సేవలు, ప్రజారక్షణ వ్యవస్థ, పారిశుధ్య సేవలు, ఆస్పత్రి లేక నర్సింగ్ హోమ్ సేవలపై వాటన్నిటికీ సంబంధించిన తగాదాలను రాజీమార్గం ద్వారా కానీ లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ దుర్గయ్య జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత


