విజయనగరం ఫోర్ట్: పనికి రాని 104 వాహనాలను ఈ నెల 17న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇ.కొనుగోలు పోర్టల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇ వేలంలో విక్రయించేందుకు నిర్ణయించినట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం నియమ నిబంధనలు, మిగిలిన వివరాలను కొనుగోలు.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరచినట్టు తెలిపారు.
యువకుడి దుర్మరణం
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని తాటిగూడ గ్రామానికి చెందిన బుద్దిమాంద్యం గల జి.ఈశ్వరరావు(31 గెడ్డపువలస సమీపంలో ఉన్న మైనింగు బంటాలో పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మృతుడు ఈశ్వరరావు ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు ఈశ్వరరావు కోసం ఆరా తీస్తుండగా బుధవారం గెడ్డపువలస గ్రామానికి సమీపంలో ఉన్న మైనింగు బంటాలో మృతదేహం తేలి ఉన్న విషయం తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఈశ్వరరావుగా గుర్తించారు. ఎస్‌ఐ బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు గడ్డివాములు దగ్ధం
దత్తిరాజేరు: మండలంలోని ఎం.లింగాలవలస గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి మూడు గడ్డివాములు దగ్ధమైనట్లు గజపతినగరం అగ్నిమాపక అధికారి రవిప్రసాద్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతులు కిలారి నాగ, కిలారి రామారావు, సింగారపు కన్నయ్యకు చెందిన గడ్డి కుప్పలు దగ్ధం కావడంతో సుమారు రూ.80 వేల వరకు నష్టం జరిగినట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంపీటీసీ అన్నజింగా అప్పలనాయుడు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజా అప్పలనాయుడు, మాజ్జి శ్రీను పరిశీలించి పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
బంగారు గొలుసు చోరీ
కొత్తవలస : మండలంలోని కొత్తవలస – కోటపాడు రోడ్డులో ప్రగతి కళాశాల సమీపంలో ఫ్యాన్సీ షాపు నిర్వాహకురాలు తలపై గుర్తు తెలియని మహిళ సుత్తితో కొట్టి మెడలో బంగారు గొలుసును దోచుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలు.. సీతంపేట గ్రామానికి చెందిన పొలమరశెట్టి పుష్ప ప్రగతి కళాశాల సమీపంలో ఫ్యాన్సీ సాపు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని మహిళ సోమవారం వచ్చి షాపులో గాజులను కొనుగోలు చేసి వెళ్లింది. మళ్లీ హ్యాండ్‌బ్యాగ్ కోసమని మంగళవారం వచ్చి చూపించమని కోరింది. షాపు నిర్వాహకురాలు పుష్ప హ్యాండ్‌బ్యాగ్‌లను చూపించే సమయంలో ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి మెడలో ఉన్న సుమారు రెండు తులా బంగారు గొలుసును లాక్కోని పారిపోయిందని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు బుధవారం తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
మద్యం బాటిళ్ల ధ్వంసం
సాలూరు: పాత కేసుల్లో పట్టుకున్న 95 మద్యం బాటిళ్లను ఏఈఎస్ సంతోష్‌కుమార్ సమక్షంలో ధ్వంసం చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ దాసు బుధవారం తెలిపారు. ఎరుకుల వీధిలో దాడులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని 37 మంది పాత సారా ముద్దాయిలను బైండోవర్ చేసినట్టు ఆయన తెలిపారు. వీరిని తహసీల్దార్ సురేష్ వద్ద హాజరుపరచి బైండోవర్ చేసినట్టు చెప్పారు.
పైడితల్లి ఆలయంలో చండీయాగం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో వేదపండితులు బుధవారం చండీయాగం నిర్వహించారు. ఆలయ అర్చకులు నేతేటి ప్రశాంత్, వేదపండితులు సాయికిరణ్ శర్మ, వెలువలపల్లి నరసింహమూర్తి యాగప్రక్రియను భక్తిశ్రద్ధలతో చేశారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.


