తెర్లాం: గంజాయి కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకువస్తున్న నలుగురు యువకులను, ఓ జువైనల్(మైనర్ బాలుడు)ను తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు పట్టుకొని అరెస్ట్ చేసిన సంఘటన ఇది. దీనికి సంబంధించి కేసు దర్యాప్తు అధికారి బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపిన వివరాలు... ఒడిశా రాష్ట్రంలోని సుంకి కొండ ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయిని రమేష్ అనే వ్యక్తి వద్ద మండలానికి చెందిన నలుగురు యువకులు కొనుగోలు చేశారు. తెర్లాం తీసుకువచ్చి మండలంలోని ఓ గ్రామానికి చెందిన జువైనల్ ద్వారా విక్రయించేందుకు లావాదేవీలు జరుపుతున్న సమయంలో తెర్లాం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితో దాడి చేసి వారి నుంచి 2.600కేజీల గంజాయిని, లావాదేవీలు జరుపుతున్న నలుగురు యువకులను, ఒక జువైనల్‌ను పట్టుకున్నారు. యువకుల వద్ద పట్టుకున్న గంజాయిని తెర్లాం ఉప తహసీల్దార్ సమక్షంలో పరిశీలించి తూకం వేసి సీజ్ చేశారు. గంజాయి కొనుగోలు చేసి, విక్రయించేందుకు లావాదేవీలు జరుపుతున్న ముగ్గురు యువకులను, ఓ జువైనల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ నేరంతో సంబంధం ఉన్న ఇద్దరు యువకుల్లో జరజాన శ్రీరామ్‌పై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు చేయడం జైలుకు వెళ్లడం జరిగిందన్నారు. అలాగే లోపింటి నాగరాజుపై గతంలో ఒకసారి గంజాయి కేసు నమోదు కాబడి గతంలో జైలుకు వెళ్లి వచ్చారన్నారు. వీరితో పాటు చౌడువాడ దిలీప్‌కుమార్, కుప్పిలి బెన్సన్, సుమంత్‌రెడ్డిని, పోలీసుల అదుపులో ఉన్న జువైనల్‌ను అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. గతంలో రెండుసార్లు గంజాయి కేసులో పట్టుబడి జైలుకు వెళ్లి మూడోసారి పట్టుబడి గంజాయి కేసులో అరెస్ట్ అయిన జరజాన శ్రీరామ్‌పై త్వరలో పీఐటీ ఎన్‌డీపీఎస్ కేసును నమోదు చేస్తామని తెలిపారు. నలుగురు నుంచి నాలుగు సెల్‌ఫోన్‌లు, రూ.350లు నగదు సీజ్ చేశామన్నారు. ఆయనతో పాటు తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు, హెచ్‌సీ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ శ్రీరామ్ ఉన్నారు.


