విజయనగరం రూరల్: గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులకు జీఓ నంబరు 91 ప్రకారం ఇవ్వాల్సిన పే స్కేల్ ను అమలు చేయాలని లేకుంటే ప్రభుత్వంపై తమ పోరాటం ఉధృతం చేస్తామని పంచాయతీ అభివృద్ధి అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జీఓ 91ను యథాతథంగా అమలు చేసి, పే స్కేలును తగ్గిస్తూ జారీ చేసిన 60 జీఓను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పంచాయతీ అభివృద్ధి అధికారుల జిల్లా సంఘం నాయకులు, సభ్యులు డీపీఓ కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి మల్లికార్జున్‌కు జీఓ 60ని రద్దు చేసి జీఓ నంబరు 91ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జీపీడీఓ సంఘం అధ్యక్షులు మంత్రి రమణ, ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు ఎర్ర రమణ, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


