పార్వతీపురం రూరల్: అపోహలు వీడి శాసీ్త్రయ వైద్యాన్ని నమ్మినప్పుడే ప్రజారోగ్యం సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి జిల్లా ఆస్పత్రి జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ‘ఆరోగ్యం కోసం కలిసి.. విజ్ఞానంతో అడుగులు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. ప్రజలు రసాయనాలతో మాగబెట్టిన పండ్లకు దూరంగా ఉండి, సహజ సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రతి రోజూ 30 నుంచి 60 నిమిషాల వ్యాయామం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు జగన్మోహనరావు, సూర్యనారాయణ, వినోద్ కుమార్, సూర్య కౌశిక్, నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి, డెమోలు, ప్రసాద్, గిరి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


