ఎండ ప్రచండం.. పిడుగుల వాన | - | Sakshi
Sakshi News home page

ఎండ ప్రచండం.. పిడుగుల వాన

Apr 8 2026 7:14 AM | Updated on Apr 8 2026 7:14 AM

ఎండ ప్రచండం.. పిడుగుల వాన

సాక్షి, పార్వతీపురం మన్యం/వీరఘట్టం: ఉదయమంతా భరించలేని ఎండ, ఉక్కపోత, వేడి గాలులు.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు. ఈదురుగాలులతో మొదలై.. పిడుగుల వాన కురుస్తోంది. కొద్దిరోజులుగా జిల్లాలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఓవైపు ఉక్కిరిబిక్కిరి అవుతూనే.. సాయంత్రం కురుస్తున్న వర్షాలతో సేద తీరుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఒకట్రెండు మండలాలు మినహా.. అన్ని చోట్లా తీవ్ర వేడి గాలులు ఉంటున్నాయి. ఇదే సమయంలో పిడుగుల వాన.. నిరుపేద రైతు కూలీలను బలి తీసుకుంటున్నాయి.

పంటలకు కష్టకాలం..

వేసవి దుక్కులకు ఈ వర్షాలు అనుకూలంగా ఉంటాయని ఓ వైపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరోవైపు మొక్క జొన్న, మామిడి, జీడి, అరటి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గాలులు, వర్షానికి పంట నేలరాలి, దెబ్బ తింటోంది. మరికొన్ని రోజుల్లో కోత దశకు వచ్చే మామిడి కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల్లో జీడి సాగవుతోంది. జీడి, మామిడి పిందె దశలో రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు. లక్ష మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు సిద్ధంగా ఉంది. కొనుగోలు కేంద్రాలు లేక, రైతులు దళారులనే ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో గింజలు తడిచిపోతే, కాస్త ధర కూడా రావడం కష్టం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ఆదివారం కురిసిన వర్షానికి జొన్న గింజలు తడిసిపోయాయి. సోమవారం ఉదయం వరకు వాటిని రైతులు ఆరబెట్టారు. మధ్యాహ్నం తర్వాత వర్షం కురవడంతో మళ్లీ అవన్నీ తడిసిముద్దయ్యాయి.

మరోవైపు వర్షానికి తోడు పిడుగులు పడడంతో శ్రమ జీవులు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం బలిజిపేట మండలం శ్రీరంగరాజపురంలో సింహాచలం.. పొలంలో మొక్కజొన్నపై టార్పాలిన్లు కప్పుతుండగా పిడుగు పాటుకు గురై మృతి చెందింది. వంతరాం గ్రామానికి చెందిన పార్వతి.. పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. పిడుగు పడటంతో ప్రాణాలు వదిలింది. మూడు రోజుల కిందట వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో పిడుగుపాటుతో వ్యవసాయ కూలీ పైల అనసూయమ్మ అనే వృద్ధురాలు తనువు చాలించింది. గతేడాది ఉమ్మడి విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు 20 మంది మృతిచెందగా, ఈ ఏడాది ఇంతవరకు నలుగురు మృతిచెందారు.

జిల్లాలో భిన్న వాతావరణం

భరించలేని వేడి.. కొద్ది సేపటికే గాలులు, వర్షం

పంటలకు నష్టం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement