సాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన ప్రక్రియలో భాగంగా.. కీలకమైన గృహ గణనకు జిల్లా యంత్రాంగం సిద్ధం అవుతోంది. మే నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సెస్ (గృహ గణన) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు.. స్వచ్ఛందంగా నమోదు చేసుకునేలా ‘స్వీయ’ సదుపాయాన్ని ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 910 గ్రామాలు ఉన్నాయి. 9.25 లక్షల మంది జనాభా ఉండగా.. సుమారు 2.50 లక్షల కుటుంబాలు ఉంటాయని అంచనా. ప్రస్తుతం ఏళ్ల కిందటి నాటి లెక్కలే ఇంకా ఆధారమవుతున్నాయి. జన, గృహగణన పూర్తయ్యాక కచ్చితమైన లెక్కలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
15 రోజులపాటు స్వీయ నమోదు
స్వీయ నమోదు ద్వారా ప్రజలు తమ ఇంటి వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో ఎస్‌ఈ.సెన్సెస్.జీఓవీ.ఇన్ అనే పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఈ నెల 16 నుంచి.. 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రతి కుటుంబం తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ ఆధారంగా లాగిన్ అయ్యి అవసరమైన సమాచారాన్ని సులభంగా నమోదు చేయవచ్చు. పోర్టల్‌లో ఇంగ్లిష్, హిందీతో పాటు అనేక ప్రాంతీయ భాషలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు తమకు సౌకర్యమైన భాషలో వివరాలు నమోదు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీనిని భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎన్యూమరేటర్‌కు చూపించవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయని కుటుంబాలను ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తారు.
జనగణనలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల సమాచారం మరింత కచ్చితంగా ఉండడమే కాకుండా, సమయం ఆదా అవుతుంది. ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్‌లో సరైన వివరాలు నమోదు చేసి జనగణన కార్యక్రమానికి సహకరించాలి. జనగణన దేశాభివృద్ధికి ముఖ్యమైన ఆధారం. ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలి.
– డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, జిల్లా కలెక్టర్
మే 1 నుంచి ప్రారంభం కానున్న గృహగణన
ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ నమోదుకు అవకాశం
జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్


