● బైకర్ మృతి, పాదచారునికి తీవ్ర గాయాలు
పెందుర్తి: బీఆర్‌టీఎస్ రహదారిలోని పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తెలిపిన విరాల ప్రకారం... సాలూరుకు చెందిన ఎం.పోలిరాజు (45) చినముషిడివాడలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన పెందుర్తిలోని ఒక బైక్ షోరూమ్‌లో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉద యం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై చినముషిడివాడ నుంచి పెందుర్తి బయలుదేరారు. ప్రభుత్వ కళాశాల దాటిన తర్వాత చర్చి సమీపంలోకి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలిరాజు వాహనంపై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలిరాజుకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉన్నారు. పెందుర్తి సీఐ కె.వి.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


